బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే ఇక మిగిలింది:
మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ -జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం అని, చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే ఇక మిగిలిందన్నారు. 2024లో రాక్షస పాలన పోయి ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. 1932లో జనవరి 4న గాంధీ అరెస్టు ఎలా గుర్తుందో.. 2023 సెప్టెంబర్ 9 చంద్రబాబు అరెస్టు రాష్ట్రంలో ప్రజలకు అలానే గుర్తు ఉంటుందన్నారు.
ఎవరినీ తొక్కాల్సిన అవసరం నాకు లేదు:
తనకు ఎవరినీ తొక్కాల్సిన అవసరం లేదని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి కుటుంబం తమదని, ఏ ఒక్క బీసీకి అన్యాయం జరగనివ్వనని, ఏ కులాన్ని తొక్కాల్సిన అవసరం తనకు లేదన్నారు. గురజాలలో తాను చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అండదండలు వైసీపీని గెలిపిస్తాయని మహేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీలో ఆశావాహులు ఉన్నారు తప్ప.. అసమ్మతివాదులు లేరుని ఆయన చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్‌కు కనీసం ఏపీలో ఓటు ఉందా?:
గృహ నిర్మాణల భూ సేకరణలో అవినీతి జరిగినట్లు ప్రధానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాయడంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు కొట్టేసిన స్కిల్ స్కాంలో పవన్ కల్యాణ్‌కు ఎంత ముట్టిందో విచారణ చేయమని తాము కూడా లెటర్ రాయబోతున్నామన్నారు. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో విచారణ జరిపించాలని కోరతామని, ఆ ప్రభుత్వంలో పవన్ కూడా భాగస్వామే అని జోగి రమేష్ తెలిపారు.
రెండు రోజులు ప్రజాపాలనకు బ్రేక్:
తెలంగాణలో ప్రజాపరిపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రజాపాలనకు ప్రభుత్వం రెండు రోజులు విరామం ఇచ్చింది. నేడు, రేపు (డిసెంబర్ 31 ఆదివారం సెలవు.. సోమవారం జనవరి 1) నూతన సంవత్సరం కావడంతో… ప్రభుత్వం అధికారికంగా రెండు రోజులు సెలవు ప్రకటించింది. దీంతో ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వ పరిపాలన కౌంటర్లలో ఎలాంటి దరఖాస్తులు తీసుకోరు. మళ్లీ 2వ తేదీ నుంచి యదావిధిగా కొనసాగుతాయని, 6వ తేదీ వరకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దరఖాస్తుల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అధికారులు సూచించారు. పనులు మానుకుని దరఖాస్తుల కోసం వచ్చి సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు.
మందుబాబులకు మంచి వార్త;
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్‌లు పిలుపునిచ్చారు. నేటి అర్ధరాత్రి వరకు పబ్‌లు, క్లబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, న్యూ ఇయర్ ఈవెంట్‌లకు మద్యం సరఫరా చేసేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంటాయని ఏసీఎస్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31 సందర్భంగా వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్‌లు అర్ధరాత్రి 1 గంటల వరకు తెరిచి ఉంటాయన్నారు. జిల్లాలో 102 వైన్ షాపులు, 17 బార్లు ఉన్నాయని తెలిపారు. వైన్ షాప్‌లు సాధారణంగా ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు, బార్‌లు రాత్రి 11 గంటలకు మూసివేయబడతాయన్న విషయం తెలిసిందే.
న్యూ ఇయర్ వేళ కొత్త నిర్ణయం:
కొత్త సంవత్సరంలో అమెరికా నగరం కాలిఫోర్నియా కొత్త జీవితాన్ని పొందబోతోంది. ఇప్పుడు ఇక్కడ డెడ్లీ వెపన్ గన్ నిషేధించబడుతుందని అంటున్నారు. తుపాకీ సంస్కృతి కారణంగా కాలిఫోర్నియా, ఇతర నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ 6 నుంచి 8 ఏళ్ల పిల్లలు సైతం తుపాకులతో పాఠశాలకు చేరుకునే పరిస్థితి నెలకొంది. కాలిఫోర్నియా గవర్నర్ తుపాకీలను నిషేధించే చట్టాన్ని కోర్టులో సవాలు చేయగా.. దానిని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ తిరస్కరించింది. బహిరంగ ప్రదేశాల్లో తుపాకులను నిషేధించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కాదని యూఎస్ సర్క్యూట్ కోర్టులోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రధాని క్రూరత్వం చూస్తుంటే బాధగా ఉంది:
అర్జున, ఖేల్ రత్న అవార్డులను వాపస్ చేస్తూ రెజ్లర్ వినేష్ ఫోగట్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అతను ఒక వీడియోను పంచుకున్నారు. ‘దేశంలోని ప్రతి కుమార్తెకు మొదట ఆత్మగౌరవం, ఆ తర్వాత ఏదైనా. ఇతర పతకం లేదా గౌరవం’ అని రాశారు. బహుళ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత వినేష్ ఫోగట్ శనివారం ఖేల్ రత్న, అర్జున అవార్డును తిరిగి ఇచ్చారు. ఇందుకోసం ఆమె ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లాలనుకున్నా.. ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీని తరువాత ఆమె తన రెండు అవార్డులను రోడ్డుపై వదిలి వెళ్లిపోయారు.
వీడు పోటుగాడే:
మరికొద్ది గంటల్లో 2023వ సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ ఏడాది చాలా విషయాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఏడాది ప్రజలు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లో అత్యధిక సంఖ్యలో బిర్యానీలను ఆర్డర్ చేశారని ఇటీవల స్విగ్గీ తెలిపింది. ఇప్పుడు Blinkit కూడా ఈ సంవత్సరం అందుకున్న గరిష్ట ఆర్డర్ ఏమిటో వెల్లడించింది. ఈ సంవత్సరం కండోమ్‌లు, లైటర్లు, పార్టీ స్మార్ట్ టాబ్లెట్‌ల కోసం బ్లింకిట్‌లో అత్యధిక ఆర్డర్‌లు వచ్చాయి. ఇందుకు సంబంధించిన గణాంకాలను Blinkit వ్యవస్థాపకుడు పంచుకున్నారు. డేటా ప్రకారం.. సౌత్ ఢిల్లీకి చెందిన ఒక కస్టమర్ 2023లో బ్లింకిట్ నుండి 9,940 కండోమ్‌లను ఆర్డర్ చేసాడు.
వంద కోట్లది ఏముందిలే:
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అంటే.. అది రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ అనే చెప్పాలి. గత కొన్నాళ్లుగా ఊరిస్తూ వస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్.. ఆఫ్రికా అడవుల్లో చేయబోయే వేట ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా, ఆర్ఆర్ఆర్‌తో టాలీవుడ్‌ను ఆస్కార్‌కు తీసుకెళ్లిన జక్కన్న.. ఈసారి ఏకంగా హాలీవుడ్‌నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. వాస్తవానికైతే 2023లోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అనుకున్నారు కానీ.. మహేష్ ‘గుంటూరు కారం’తో బిజీగా ఉండడ, రాజమౌళి స్క్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉన్నాడు కాబట్టి డిలే అయింది. ఇప్పుడు వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ముందుగా ఈ మూవీని భారీ సెట్‌లో షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా 100 కోట్ల ఖర్చుతో ఓ భారీ సెట్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ భాగం షూటింగ్ ఈ సెట్లోనే జరగనున్నట్లు సమాచారం. ఈ సెట్‌తో పాటు ఆఫ్రికా, యూరప్‌లోనూ షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారట.