ఫిబ్రవరి 17న వైఎస్ షర్మిల కుమారుడి వివాహం:
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. అనిల్ కుమార్, వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజా రెడ్డి 2024 ఫిబ్రవరి 17న పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ విషయాన్ని వైఎస్ షర్మిల సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. అట్లూరి ప్రియాతో రాజా రెడ్డికి వివాహం జరగనున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు. రాజా రెడ్డి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. రాజా రెడ్డి, అట్లూరి ప్రియ వివాహంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తోన్నప్పటికీ వైఎస్ షర్మిల స్పందించలేదు. న్యూఇయర్ సందర్బంగా తనయుడి వివాహంపై మౌనం వీడారు.
త్వరలోనే ముద్రగడ ఏదో ఒక పార్టీలో చేరుతారు:
కొత్త సంవత్సరం వేళ ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేసారు. ఈ రోజు తన రాజకీయ నిర్ణయంపై అనుచరులకు ముద్రగడ ఓ స్పష్టత ఇవ్వనున్నారు. ప్రస్తుతం ముద్రగడ నివాసానికి అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ముద్రగడ సహా ఆయన ఇద్దరు కుమారులకు అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజకీయాల్లోకి తిరిగి ఎప్పుడు వస్తారు? అని ముద్రగడను అనుచరులు అడుగుతున్నారు.
మోడీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగింది:
ప్రధాని మోడీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రధాని తన మిత్రులకు అమ్మేస్తున్నారని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్లు ముగిసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. ప్రధానితో సీఎం వైఎస్ జగన్ పార్టీ తెరవెనుక ఒప్పందం పెట్టుకుందని మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన మాణిక్కం ఠాగూర్.. బీజేపీ, టీడీపీ, జనసేనలపై మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాలపై కేసు:
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో షేక్‌పేట్ తహసీల్దార్ అనితా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాలపై కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నం.3లో ప్లాట్ నంబరు 8-c పేరుతో ఉన్న 2285 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమి టెడ్ సంస్థకు చెందిన ఉపేందర్ రెడ్డితో పాటు ఇతరులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. గతంలో ఫ్లాట్ నం.8-డీలో షౌకతున్నీసా పేరుతో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన కందాల 8-Cలో స్థలాన్ని తమదిగా చెబుతున్నారు. ఈ సర్వే నంబరులో మొత్తం 2.25 ఎక రాలు ఉండగా అందులో అత్యధిక భాగం షౌకత్నగర్ బస్తీగా ఏర్పడగా 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది.
ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం:
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాడ్డాక 6 హామీలో భాగంగా.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబరు 9 నుంచి వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దాంతో రోజువారి ఆదాయం కోల్పోయామని, కుటుంబాలను ఎలా పోషించుకుంటామని ఆగ్రహం ఆటో డ్రైవర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుమార్లు ఆటోడ్రైవర్లు నిరసనలు తెలిపారు. ప్రభుత్వ అధికారులతోనూ సమావేశమయ్యారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4న ఇందిరాపార్కు వద్ద మహాధర్నాకు ఆటోడ్రైవర్లు పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మహాధర్నా చేపడతామని ఆటో కార్మికులు ప్రకటించారు.
రాత్రికి రాత్రే మాయమైన చెరువు:
బీహార్‌లోని దర్భంగాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇక్కడ ఒక చెరువు రాత్రికి రాత్రే కనుమరుగైంది. ఒకరోజు క్రితం సాయంత్రం వరకు ఇక్కడ చెరువులో నీరు చేరి బాతులు ఈత కొట్టిన స్థలం.. ఉన్న ఫళంగా మాయం కావడమే కాకుండా ఓ గుడిసె కూడా వెలిసింది. ఈ విషయమై గ్రామస్తులు ఎస్‌డీపీఓకు ఫిర్యాదు చేశారు. చెరువు భూమిని కబ్జా చేసేందుకు ల్యాండ్ మాఫియా రాత్రికి రాత్రే మట్టిని పోసి చదును చేసిందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్‌డిపిఒ అమిత్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ల్యాండ్ మాఫియా వద్దకు చేరుకునే సమయానికి వారు అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం చర్యలు తీసుకోవాలని ఎస్‌డిపిఓ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. విషయం దర్భంగాలోని యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ ఏరియాలోని వార్డ్ నంబర్ 4లో ఉన్న నీమ్ పోఖర్ ప్రాంతానికి సంబంధించినది.
ఘోర రోడ్డు ప్రమాదం:
జార్ఖండ్‌లో నూతన సంవత్సరం ఆనందం శోక సంద్రంగా మారింది. జంషెడ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మంది మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన జంషెడ్‌పూర్‌లోని బిస్తుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అతి వేగంతో వెళ్తున్న కారు మొదట స్తంభాన్ని, ఆ తర్వాత చెట్టును ఢీకొట్టిందని చెబుతున్నారు. ఢీకొనడంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. చెట్టును ఢీకొనడంతో కారు ముక్కలైపోయింది.
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కోట బొమ్మాళి పీఎస్’:
సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా నవంబర్ 24 న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మలయాళం హిట్ మూవీ నాయట్టుకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కోట బొమ్మాళి పీఎస్’కు తేజ మర్ని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ స్ట్రీమింగ్ గురించి అప్‍డేట్ ఇచ్చింది. కోట బొమ్మాళి పీఎస్ చిత్రాన్ని సంక్రాంతికి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు ఆహా వెల్లడించింది.
