గురజాలలో పోటీ చేసే హక్కు నాకు ఉంది:
గురజాలలో పోటీ చేసే హక్కు తనకు ఉందని , అందుకే అధిష్టానాన్ని సీటు కోరుతున్నానని ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి అన్నారు. ‘గతంలో రెండు సార్లు నేను అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను. 2019లో కూడా పార్టీ అవసరాల మేరకే సీటు త్యాగం చేశాను. అయినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ నన్ను అనేక అవమానాలకు గురి చేశాడు. ఎమ్మెల్యే ఓ వర్గం వాళ్ళకి మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారు. ఎందుకు అలా జరుగుతుందో పార్టీ గమనించాలి’ అని అన్నారు. ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్ గా ఉన్న నన్ను కలవడానికి కూడా వైసీపీ క్యాడర్ పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు.
నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది:
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించడం లేదని అపవాదు వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మీడియాతో పురంధేశ్వరి మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించడం లేదని అపవాదు వేస్తున్నారు. మోడీ సర్కార్ భాగ్యస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగడం లేదు. కార్యకర్తలను కలవాలని ఈ పర్యటనలు చేస్తున్నాను. జిల్లాలలో రాజకీయ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వహిర్తించడం లేదు. రాష్ట్రంలో స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కాకినాడలో పెట్రో కెమికల్ కారిడర్ పెడతామని కేంద్రం ముందుకు వస్తే రాష్ట్రం రాలేదు’ అని పురంధేశ్వరి అన్నారు.
రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన ఖరారు:
తొలిసారి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి నెలలో ఆయన స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 15-19 మధ్య దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు దావోస్‌కు వెళ్లనున్నారు. ఈ సదస్సులో భాగంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో సీఎం సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశాలు, ప్రయోజనాల గురించి వారికి వివరించనున్నారు. తెలంగాణ ఇప్పటికే పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టగా, ఆ కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ ప్రతినిధి బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.
మేడిగడ్డలో తెలంగాణ మంత్రుల పర్యటన:
కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ మంత్రుల బృందం ఈరోజు మేడిగడ్డను సందర్శించింది. మేడిగడ్డలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు పర్యటిస్తున్నారు. మేడిగడ్డ నిర్మాణంపై అధికారులు రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను వారు పరిశీలించారు. ‘ఈ ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ ప్రాజెక్టు కుప్పకూలింది. మేడిగడ్డ కుప్పకూలినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేడు’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.
24 గంటల్లో 18 పాజిటివ్ కేసులు:
రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండడం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్న కూడా కేసులు పదుల సంఖ్యలో నమోదు కాగా.. దీంతో కోవిడ్ కేసులు రాష్ట్రంలో 100కు చేరువలో ఉండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. హైద్రాబాద్ లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయని.. మేజర్ గా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆసుపత్రులలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు వైద్యులు కోవిడ్ భారిన పడ్డారన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో మరిన్ని పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అప్రమత్తంగా లేకపోతే ముప్పు తప్పదు అని వైద్యులు సూచిస్తున్నారు.
టెన్త్ స్టూడెంట్ తో ప్రిన్సిపల్ రొమాంటిక్ ఫోటో షూట్:
సినిమాల ప్రభావమో లేదా సోషల్ మీడియా పైత్యమో తెలియదు కానీ.. ఇప్పుడు ప్రేమకు అర్థాలు మారిపోయాయి. వావివరుసలు మర్చిపోయి మరీ ప్రేమలో పడిపోతున్నారు. చదువుకోమని పాఠశాలకు పంపితే అక్కడ టీచర్లతో ప్రేమాయణాలు నడుపుతున్నారు. తాజాగా ఓ టెన్త్ క్లాస్ స్టూడెంట్ తను చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ తో ప్రేమాయణం కొనసాగించాడు. అంతటితో ఆగకుండా వారిద్దరూ రొమాంటిక్ యాంగిల్స్ లో ఫోటో షూట్ తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద దుమారమే రేగుతోంది. ఈ ఘటన కర్ణాటకలోని మురుగమల్లా గ్రామంలో చోటు చేసుకుంది.
గుంటూరు కారం ‘మాస్ సాంగ్’ ప్రోమో:
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా సినిమా ‘గుంటూరు కారం’. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. యువ హీరోయిన్ శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. గుంటూరు కారం సినిమా నుంచి మాస్ సాంగ్ ‘కుర్చీ మడతపెట్టి’ ప్రోమోను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. ఈ ప్రోమోలో మహేశ్ బాబు, శ్రీలీల డాన్స్ ఇరగదీశారు.
మొహ్మద్ షమీ స్థానంలో అవేశ్ ఖాన్:
జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు భారత జట్టులో బీసీసీఐ మార్పు చేసింది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ స్థానంలో అవేశ్ ఖాన్‌ను తీసుకుంది. తొలి టెస్టులో షమీ ఆడలేదు. అయితే ముందుగా రెండో టెస్టుకు అతన్ని ఎంపిక చేశారు. అయితే చీలమండ గాయం కారణంగా షమీ ఇంకా జట్టుతో కలవలేదు. దీంతో షమీ స్థానంలో అవేశ్ ఖాన్‌కు బీసీసీఐ చోటు కల్పించింది.
