NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

కేఏ పాల్ సవాల్:
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల మీటింగ్ ఉత్తరాంధ్రలో జరిగింది. కొందరు ఎన్టీ రామారావు తో లోకేష్ న్ పోలిస్తున్నారు. ఇదేం పోలిక, కనీసం పెద్ద ఎన్టీఆర్ ను జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చండి. నేను సత్యం మాత్రమే మాట్లాడతాను. చంద్రబాబు, లోకేష్ కు 10 ప్రశ్నలు అడుగుతున్నాను. ముఖ్యమంత్రి అయ్యేందుకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు నిజమా కాదా?. ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం 50 కోట్లు అడిగారా లేదా. టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా లోకేష్ ను చేస్తారు కాదా?. ఏపీని సింగపూర్ అని చెప్పి ఉప్పల ఆంధ్రాని చేశారు. ఇప్పుడున్న అప్పులను ఎలా తీరుస్తారో నాతో చర్చకు రావాలి’ అంటూ కేఏ పాల్ సవాల్ విసిరారు.

రాజ్యసభలో తెలుగులో మాట్లాడిన ఎంపీ:
శబరిమల అయ్యప్ప భక్తుల కష్టాలపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ మాట్లాడారు. ప్రతి ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామిని దర్శనానికి కేరళ వెళుతుంటారని.. అక్కడి ప్రభుత్వం కనీస సదుపాయాలు కల్పించకుండా ఉదాసీనత చూపిస్తోందన్నారు. 20 గంటలుగా క్యూలైన్లలో భక్తులు ఇబ్బందిపడుతున్నా, తొక్కిసలాట జరుగుతున్నా.. కేరళ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని భక్తులకు కనీస సదుపాయాలు కల్పించాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు.

జగదీష్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి:
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా మాజీమంత్రి జగదీష్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్ధం అని కోమటిరెడ్డి చెప్పారు. ఏ సబ్ స్టేషన్ అయినా పోదాం.. 8 నుంచి 12 గంటల కరెంట్ ఇచ్చినట్టు లాక్ బుక్ లో ఉంది.. మేము చెక్ చేసిన తర్వాత లాక్ బుక్ లేకుండా చేశారన్నారు కోమటిరెడ్డి. వెంకట్ రెడ్డికి జగదీష్ రెడ్డి కౌంటర్ ఎటాక్ కు దిగారు. విద్యుత్ శాఖలో అవినీతి జరిగితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని జగదీష్ రెడ్డి కోరారు.

ప్రభుత్వంలో ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందే:
సాగు నీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. 1956 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు నిర్మించిన ప్రాజెక్టులు, వాటి నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టుల వారీగా సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాలను అధికారుల ద్వారా సీఎం తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రజలకు తెలియజేసేలా చూడాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని రకాల లెక్కలు పూర్తిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్:
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు హైకోర్టు వీలు కల్పించింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్ కొట్టివేసింది న్యాయస్థానం. ఇంతకుముందు.. ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పిటిషన్‌ను ఈరోజు విచారించగా.. ఎన్నికలు జరుపుకోవచ్చని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ‘ఎక్స్‌’ సేవలకు అంతరాయం:
X Down again Across the World: ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ఎక్స్‌లో సమస్య తలెత్తింది. ఎక్స్‌ ఖాతాలను తెరవగానే.. టైమ్‌లైన్‌ ఖాళీగా కన్పిస్తోంది. వినియోగదారులకు ట్వీట్లను చూపడం లేదు. ఫాలోయింగ్‌, ఫర్‌ యూ, లిస్ట్‌ పేజీలు కూడా ఖాళీగా కన్పిస్తున్నాయి. ప్రస్తుతం #TwitterDown అని ట్రెండింగ్‌లో ఉంది.

విద్యుత్ రంగంలో అరాచకం సృష్టించారు:
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు సభలో విద్యుత్ రంగంపై స్పల్పకాలిక చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్యుత్ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. గత ప్రభుత్వం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ మాత్రమే పూర్తి చేసింది.. రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో 81 వేల 516 కోట్ల అప్పు ఉందని పేర్కొన్నారు. డిస్కంలకు ప్రభుత్వం శాఖల బకాయిలు 28, 842 కోట్లు.. సాగునీటి శాఖ చెల్లించాల్సిన బాకీనే 14, 193 కోట్లు.. రూ.14, 928 కోట్ల భారం డిస్కంల ఆర్థికస్థితిని మరింత కుంగదీశాయని భట్టి విక్రమార్క అన్నారు.

భార్యాభర్తల మధ్య ఫిట్టింగ్ పెట్టిన బిగ్ బాస్:
బిగ్ బాస్.. ఈ పేరు ఒకప్పుడు బాగా ఫెమస్.. ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ గా మారుతుంది.. నిన్న తెలుగు బిగ్ బాస్ లో విన్నర్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. అది ఇప్పటికి సంచలంగానే ఉంది.. తెలుగులోనే కాకుండా అటు హిందీ, తమిళం, కన్నడలోనూ బిగ్‏బాస్ రియాల్టీ షో ప్రసారమవుతుంది. అయితే అన్ని భాషల్లోనూ ఈ షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బిగ్‏బాస్ రియాల్టీ షో.. స్నేహితులను చేస్తుంది.. ప్రేమికులను విడదీస్తుంది. కానీ ఇప్పుడు బిగ్‏బాస్ ఏకంగా ఓ జంట విడాకులు తీసుకునేందుకు కారణమవుతుంది. రెండేళ్లు వైవాహిక బంధంలో బిగ్‏బాస్ గొడవలు పెట్టింది. ఏకంగా హౌస్ లోనే విడాకులు తీసుకోబోతున్నట్లు చెప్పారు.. ఇంతకీ ఆ జంట ఎవరో తెలుసా.. బాలీవుడ్ బుల్లితెర ఫేమస్ నటి అంకితా లోఖండే.. విక్కీ జైన్.