ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యం అయిన మగత సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి బింబిసారుడు. హర్యాంక వంశానికి చెందిన బింబిసారుడు క్రీస్తు పూర్వం 558లో జన్మించారు. ఆయన భట్టియా అనే గ్రామాధిపతి కుమారుడు. బింబిసారుడు క్రీస్తు పూర్వం 543లో 15 సంవత్సరాల వయసులోనే సింహాసనాన్ని అధిష్టించారు. బింబిసారుడు కాలంలో భారత ఉపఖండం మహాజన పదాలు మరియు జనపదాలు అనే రెండు ప్రధాన రాజకీయ విభాగాలుగా ఉండేది. గొప్ప రాజ్యాలు అయిన మహా జనపదాలు పదహారు ఉండేవి. వీటిలో కొన్ని గణతంత్ర రాజ్యాలు కాగా మరికొన్ని రాజవంశాలు పరిపాలించే రాచరిక రాజ్యాలు. వీటిలో ముఖ్యంగా నాలుగు పెద్ద రాజ్యాలు ఉండేవి. అవి కోసల, అవంతి, వత్స మరియు మగధ.
ప్రస్తుతం భారతదేశంలో ఉన్న దక్షిణ బీహార్ ప్రాంతమే, ఒకప్పటి భారత ఉపఖండంలో ఉన్న మగధ రాజ్యం. మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్న బింబిసారుడు మొదట బ్రహ్మ దత్త అనే రాజు చేతిలో తన తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన శత్రువు రాజ్యమైన అంగ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడు అజాత శత్రు ని అంగ రాజ్యానికి గవర్నర్‌గా నియమించారు. బంగాళాఖాతం సమీపంలో ఉన్న అంగ రాజ్యాన్ని జయించడం వల్ల అంగ రాజ్యం యొక్క సముద్ర మార్గాలపై, గంగా డెల్టాకు వెళ్ళే మార్గాలపై మగధకు నియంత్రణ లభించింది. ఇది మగధ రాజ్యానికి విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడంలో దోహదపడింది. ఈ విజయం.. మగధ సామ్రాజ్య విస్తరణకు పునాదులు వేసినట్లు భావించబడుతుంది. ఆ తరువాత బింబిసారుడు తన దృష్టిని భారత ఉపఖండం లోని ఇతర శక్తివంతమైన రాజ్యాల వైపు మళ్ళించారు. బింబిసారుడు చాలా సమర్ధుడైన సైనికాధికారి. తన సైనిక దళాల పరిమితులు గురించి తెలిసిన అతను, తన రాజ్య పరిధిని పెంచుకోవడానికి, యుద్ధాలలో లొంగలేని రాజ్యాలను వివాహ సంబంధాలతో దక్కించుకునేవారు. కోసల రాజు మహాకోసల కుమార్తె ప్రసేనజితు సోదరి అయిన కోసల దేవిని బింబిసారుడు వివాహం చేసుకున్నారు.
తద్వారా పవిత్ర నగరమైన కాశీ ని కట్నంగా పొందారు. తత్ఫలితంగా మంచి ఆదాయ వనరుగా ఉన్న కాశి మగధ ఖజానాలు మరింత బలోపేతం చేసింది. ఈ వివాహం మగధ, కోసల రాజ్యాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని చెరిపి వేసి ఇతర రాజ్యాలతో సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత వైశాల్యం ప్రాంతానికి చెందిన జైన రాజు చేతికి కుమార్తె లిచ్చావి యువరాణి అయిన చల్ల నను, పంజాబ్లోని మద్ర వంశానికి చెందిన యువరాణి ఖేమను వివాహమడారు. గౌతమ బుద్ధునికి సంబంధించిన పవిత్ర గ్రంధమైన మహావగ్గలో బింబిసారుడు కి 500 మంది భార్యలు ఉన్నారని చెప్పబడింది. జైన గ్రంధాలలో బింబిసారుడు అని శ్రైనిక్ అని పేర్కొన్నారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయిన యుద్ధానికి సంసిద్ధంగా ఉండే సైన్యాన్ని కలిగి ఉండేవారు మనకి అర్థం. ఇటువంటి సైన్యాన్ని ఇంగ్లీష్ లో స్టాండింగ్ ఆర్మీ అని అంటారు. బింబిసారుడు ధైర్యవంతుడైన రాజు మాత్రమే కాదు పొరుగు రాజ్యాలతో సామరస్య పూర్వక సంబంధాలను కొనసాగించే సహృదయుడు. తన రాజ్యాన్ని సుస్థిర పరచడానికి బింబిసారుడు అత్యంత శక్తివంతమైన అవంతి రాజ్యం.. దాని రాజధాని ఉజ్జయిని పై తన దృష్టిని కేంద్రీకరించారు. కానీ అనేక యుద్ధాల తరువాత కూడా బింబిసారుడు గానీ అవంతి రాజు ప్రద్యోత గానీ విజయం సాధించలేదు. అయితే బింబిసారుడు మంచి వ్యూహకర్త కావడంతో రాజు ప్రద్యోతతో స్నేహం ఏర్పరచుకున్నారు. రాజు ప్రద్యోత ఒకసారి అనారోగ్యానికి గురైనప్పుడు బింబిసారుడు, అవంతి రాజు ప్రద్యోతకు కామెర్ల వైద్య చికిత్స కోసం తన వైద్యుడైన జీవిక ను ఉజ్జయినికి పంపాలని బౌద్ధ వర్గాలు పేర్కొంటున్నాయి.మగధ సామ్రాజ్యం మొదటి రాజధాని రాజగృహ. దీనిని రాజ్ గిర్, గిరివ్రజా అని కూడా పిలుస్తారు.
ఇది ఇప్పటికీ కూడా జైనులకు పవిత్ర తీర్థ యాత్ర స్థలంగా ఉంది. తర్వాత రాజధాని పాటలీపుత్ర కు మార్చబడింది. బౌద్ధ రచనలలో రాజు గృహ నగరాన్ని బింబిసారుడు నిర్మించారని, బౌద్ధమత వ్యవస్థాపకులైన గౌతమబుద్ధుడు తన జీవితంలో ఎక్కువ కాలం మగధ సామ్రాజ్యంలోనే గడిపారు అని చెబుతారు. బింబిసారుడు పాలించిన కాలంలోనే బౌద్ధమత వ్యవస్థాపకులైన గౌతమబుద్ధుడు మరియు జైనమత వ్యవస్థాపకులైన మహావీర వర్ధమాన ఇద్దరూ తమ బోధనలను ప్రారంభించారు. బింబిసారుడు కి బౌద్ధం మరియు జైన రచనలలో చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. అయినప్పటికీ బింబిసారుడు ఏ మతాన్ని ఆచరించారు అనేదానిపై స్పష్టత లేదు. బౌద్ధ, జైన మతాలు రెండు ఈయన్ను తమ మతస్తుడు గానే చెప్పుకుంటాయి. మగధ రాజు సింహాసనాన్ని అధిరోహించడానికి బింబిసారుని కుమారుడు అజాతశత్రు బింబిసారుడుని ఖైదు చేశారు.
జైన మరియు బౌద్ధ చారిత్రిక రచనల ప్రకారం.. బిందుసారుని మరణంపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. జైన గ్రంధాలు, బింబిసారుడు విషం తాగి చర్యలు ఆత్మహత్య చేసుకున్నాడు అని పేర్కొన్నాయి. బౌద్ధ గ్రంథాలు.. బింబిసారుడు కుమారుడైన అజాతశత్రు బుద్ధుని దుష్ట బంధువు అయినా దేవదత్త ప్రభావంతో తన తండ్రి బింబిసారుడు చంపాడని పేర్కొన్నాయి. క్రీస్తు పూర్వం 491లో బింబిసారుడు మరణించారు. పురాణాలు బింబిసారుడు మగధను 28 లేదా 38 సంవత్సరాలు పరిపాలించాడని పేర్కొన్నాయి. సింహాళ చారిత్రక రచనలు.. బింబిసారుడు 52 సంవత్సరాలు పాలించారని చెబుతున్నాయి. బింబిసారుడు మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన సమర్థుడైన పాలకుడిగా మాత్రమే కాకుండా, భారతదేశపు మొదటి ప్రధాన పాలకుడిగా కూడా అతను చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. బింబిసారుడు ఏకీకృతం చేసి పాలించిన మగధ సామ్రాజ్యం ఆ తరువాతి కాలంలో నంద మరియు మౌర్యులు సామ్రాజ్యాలకు గట్టి పునాదులు వేసింది.