NTV Telugu Site icon

JPL 2024: ఆంధ్రజ్యోతిపై ఘన విజయం.. జేపీఎల్ 2024 ఫైనల్లో ఎన్టీవీ!

Ntv In Jpl 2024

Ntv In Jpl 2024

Ntv Reached JPL 2024 Finals: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ టీవీ ఛానెల్ ‘ఎన్టీవీ’.. జ‌ర్న‌లిస్టు ప్రీమియ‌ర్ లీగ్ (జేపీఎల్‌) టీ20 టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్-1లో ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఏబీఎన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులకే పరిమితమైంది. అశోక్ చౌదరికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎన్టీవీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 రన్స్ చేసింది. హిట్టర్ మంద రాజు (41; 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఆల్‌రౌండర్‌ వంశీ (47; 45 బంతుల్లో 3 ఫోర్లు) టాప్ స్కోరర్లు. ఇన్నింగ్స్ చివరలో అశోక్ చౌదరి (25; 15 బంతుల్లో 3 సిక్సులు) మూడు భారీ సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బౌలర్ నాగేంద్ర 2 వికెట్స్ పడగొట్టాడు. అబ్దుల్, రవి, దిలీప్, సురేష్ తలో వికెట్ తీశారు.

భారీ లక్ష్య ఛేదనలో ఎన్టీవీ బౌలర్ల దెబ్బకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. సురేష్ (4), అబ్దుల్ (0), రవి (9), హనుమ (0) త్వరగానే పెవిలియన్ చేరారు. ఓపెనర్ దిలీప్ (42; 44 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా.. ఫలితం లేకుండా పోయింది. ఎన్టీవీ బౌలర్ అశోక్ మూడు వికెట్స్ తీయగా.. కృనాల్ రెండు వికెట్స్ పడగొట్టాడు. ప్రస్తుతం రెండో సెమీ ఫైనల్లో బిగ్ టీవీ, టీవీ 9 తలపడుతున్నాయి. ఇందులో గెలిచిన జట్టుతో ఎన్టీవీ ఫైనల్స్ ఆడుతుంది.