NTV Telugu Site icon

Australian Open 2025: చరిత్ర సృష్టించే దిశగా జకోవిచ్‌.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పటికీ..!

Novak Djokovic

Novak Djokovic

25వ టైటిల్‌తో చరిత్ర సృష్టించే దిశగా టెన్నిస్‌ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌ (సెర్బియా) సాగిపోతున్నాడు. గతేడాది ఒక్క గ్రాండ్‌స్లామ్‌ కూడా గెలవని జకో.. తన అడ్డా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జోరు సాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో జకోవిచ్‌ 6-1, 6-4, 6-4తో మచాక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలిచాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో సెట్‌ కోల్పోయిన జకో.. ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండో సెట్‌ ఆరంభంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పటికీ.. కోర్టులోనే చికిత్స తీసుకుని సునాయాస విజయం సాదించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.

రెండో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-3, 6-4, 6-4తో జేకబ్‌ (బ్రిటన్‌)పై గెలవగా.. మూడో సీడ్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) 6-2, 6-4, 6-7 (3-7), 6-2తో బోర్గెస్‌ (పోర్చుగల్‌)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో బెలారస్‌ భామ సబలెంక సత్తాచాటుతోంది. మూడో రౌండ్లో 7-6 (7-5), 6-4తో టాసన్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించింది. మూడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) 6-4, 6-2తో ఫెర్నాండెజ్‌ (కెనడా)పై గెలుపొందింది. ఏడో సీడ్‌ పెగులా (అమెరికా) 7-6 (7-3), 6-1తో డానిలోవిచ్‌ (సెర్బియా)పై ఓడిపోయింది. ఇక మాజీ ఛాంపియన్‌ ఒసాక (జపాన్‌) ఉదర కండరం నొప్పితో బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌)తో మ్యాచ్‌ మధ్యలోనే నిష్క్రమించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో రోహన్‌ బోపన్న, షూయి జంగ్‌ జోడి 6-4, 6-4తో డోడిగ్‌ (క్రొయేషియా)- క్రిస్టీనా (ఫ్రాన్స్‌)పై నెగ్గింది.