Jairam Ramesh: నోట్లబందీ, ఓట్లబందీ ఒకే నాణేనికి రెండు వైపులు.. జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు..

Jairam Ramesh

Jairam Ramesh

నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. నోట్ల రద్దు (నోట్ బందీ), ఓట్ల తొలగింపు (ఓట్ బందీ) ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ గురువారం ఆరోపించారు. గతంలో నోట్ల రద్దు ద్వారా సామాన్య ప్రజల సంపాదన, జీవనోపాధిపై దాడి చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ‘ఓట్ల చోరీ’ ద్వారా పౌరుల ఓటు హక్కును, ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తోందని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచే ప్రజల శక్తిని బలహీనపరుస్తున్నారని జైరాం రమేష్ ‘ఎక్స్’ (X) వేదికగా ఆరోపించారు. పేదలు, కార్మికులు, రైతులు, వెనుకబడిన వర్గాలు, యువత, మధ్యతరగతి ప్రజల చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు మాత్రమేనని గుర్తుచేశారు. ఓడిపోతామన్న భయం ఉన్నప్పుడే ప్రభుత్వాలు ప్రజల సమస్యలను విని, తమ విధానాలకు బాధ్యత వహిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, ప్రజాతీర్పుతో సంబంధం లేకుండా అధికారంలో కొనసాగగలమనే ధీమాతో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందని రమేష్ విమర్శించారు.

ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం వల్ల ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును కోల్పోతున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. గత పన్నెండేళ్ల మోడీ పాలనలో ద్రవ్యోల్బణంతో సామాన్యుల బడ్జెట్ తలకిందులైందని, నిరుద్యోగం యువత భవిష్యత్తును దెబ్బతీసిందని, ఉపాధి హామీ పథకంలో (MGNREGA) మార్పుల వల్ల గ్రామీణ కార్మికుల హక్కులు బలహీనపడ్డాయని ఆయన పేర్కొన్నారు.

కేవలం కొద్దిమంది కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తూ, సామాన్యుల సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు. ఓటు శక్తి తగ్గినప్పుడు ప్రభుత్వ జవాబుదారీతనం నశించి, అధికార అహంకారం పెరుగుతుందని జైరాం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తమ పోరాటం కేవలం ఓటును కాపాడుకోవడానికి మాత్రమే కాదని, ప్రతి పౌరుడి హక్కులను రక్షించుకోవడానికని స్పష్టం చేస్తూ ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ అనే నినాదంతో ఆయన తన పోస్టును ముగించారు.