Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..

Noro Virus

Noro Virus

ప్రపంచవ్యాప్తంగా గతంలో కరోనా వైరస్ సృష్టించిన భీభత్సం ఎవరూ మర్చిపోలేరు. ఆ పరిస్థితుల నుంచి భయటపడే లోపే ఇటీవల హంటా వైరస్ కలకలం రేపింది. ప్రస్తుతం మరో వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా క్రూయిజ్ షిప్‌ల వంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో ఇలాంటి వైరస్‌లు వేగంగా విస్తరిస్తాయి. ఇటీవలే అమెరికాలో ‘కారిబ్బన్ ప్రిన్సెస్’ షిప్‌లో వందలాది మంది అస్వస్థతకు గురవ్వగా, ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఏకంగా ఒకరు మరణించడం ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఆహారం, నీరు, కలుషిత ఆహారాలు తినడం ద్వారా అతివేగంగా వ్యాపించే ఈ వైరస్, పర్యాటక రంగంపై మళ్ళీ నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.

అంబాసిడర్ క్రూయిజ్ లైన్‌కు చెందిన ‘అంబిషన్’ నౌక మే 6న షెట్లాండ్ దీవుల నుంచి బయలుదేరింది. బెల్ఫాస్ట్, లివర్పూల్ మరియు బ్రెస్ట్‌లలో ఆగి, మంగళవారం ఫ్రాన్స్‌లోని బోర్డియక్స్ ఓడరేవుకు చేరుకుంది. నౌకలో ఉన్న 90 ఏళ్ల వృద్ధుడైన ఒక ప్రయాణికుడు అనుమానాస్పద నోరోవైరస్ ఇన్ఫెక్షన్‌తో మరణించారు. వీరితో పాటు సుమారు 50 మంది ప్రయాణికులలో వాంతులు, విరేచనాలు వంటి నోరోవైరస్ లక్షణాలు కనిపించాయి.

మరణం సంభవించడంతో అప్రమత్తమైన ఫ్రెంచ్ అధికారులు, బుధవారం నాడు నౌకలోని 1,233 మంది ప్రయాణికులు (ఎక్కువగా బ్రిటన్, ఐర్లాండ్ వాసులు) మరియు సుమారు 500 మంది సిబ్బందిని కలిపి మొత్తం 1,700 మందిని నౌకలోనే నిర్బంధించారు. నోరోవైరస్ అత్యంత వేగంగా వ్యాపించే కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్. ఇది సోకిన 12 నుంచి 48 గంటల్లో కడుపు నొప్పి, వికారం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ మరింత విస్తరించకుండా ఉండటానికి అధికారులు పారిశుధ్య చర్యలను ముమ్మరం చేశారు. బాధితులను ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. షిప్ షెడ్యూల్ ప్రకారం స్పెయిన్ వెళ్లాల్సి ఉండగా, ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా దాని ప్రయాణాన్ని నిలిపివేశారు. ఈ సంఘటనతో అంతర్జాతీయ ప్రయాణాల్లో పారిశుధ్య ప్రమాణాల ప్రాముఖ్యత మరోసారి చర్చనీయాంశమైంది.