Kiran Rijiju: నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జెఎసి) బిల్లును తిరిగి ప్రవేశపెట్టే ప్రతిపాదన ప్రస్తుతం లేదని గురువారం రాజ్యసభకు కేంద్రం తెలియజేసింది. ఎన్‌జేఏసీని సవరణలతో మళ్లీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోందా అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, సీపీఎంకు చెందిన జాన్ బ్రిటాస్‌లు అడిగిన ప్రశ్నకు న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు సమాధానమిస్తూ.. ప్రస్తుతం మార్పులతో పాటు అటువంటి ప్రతిపాదన లేదని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు ఉద్దేశించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని 2015లో అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
పార్లమెంట్ ఆమోదించిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ యాక్ట్-2014 (ఎన్‌జేఏసీ)ను సుప్రీంకోర్టు రద్దు చేయటం అంటే ప్రజానిర్ణయాన్ని తిరస్కరించటమేనని రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ అన్నారు. పార్లమెంటరీ సార్వభౌమత్వం రాజీపడినట్టేనని అన్నారు. ఉపరాష్ట్రపతి ధన్‌కర్ రాజ్యసభ చైర్మన్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టి సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ఎన్‌జేఏసీ రద్దుపై మరోసారి తన స్వరాన్ని వినిపించారు. పార్లమెంట్ అనేది ప్రజా శాసనాలను సంరక్షించేదని, ఈ సమస్యపై దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. పార్లమెంట్ ఆ దిశగా చర్యలు చేపడుతుందని నమ్ముతున్నానని చెప్పారు. కాగా, గత వారం సింఘ్వీ స్మారకోపన్యాసం సందర్భంగా మాట్లాడిన ధన్‌కర్.. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సమక్షంలోనే ఎన్‌జేఏసీ రద్దును ప్రశ్నించారు. చట్టాలను రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిదని అన్నారు. ఇలాంటి ఘటనలను ప్రపంచం ఎన్నడూ చూడలేదని వెల్లడించారు.
Job Vacancies: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఖాళీలు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి
‘2015-16లో పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. దాన్ని లోక్‌సభ, రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించాయి. విస్తృత ప్రజాభిప్రాయానికి ప్రతీక అయిన ఆ చట్టం రాజ్యాంగ నిబంధన అయ్యింది. కానీ, దాన్ని న్యాయస్థానం కొట్టేసింది. మనలాంటి చైతన్యవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో విస్తృత ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే చట్టాలు చేయకుంటే ఎలా? ఇంకా ఆలస్యం కాలేదు. దీని గురించి అందరూ ఆలోచించాలి’ అని పేర్కొన్నారు.
