Gyanvapi Survey: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జులై 26 వరకు ఎలాంటి సర్వే నిర్వహించవద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. వారణాసి కోర్టు ఇచ్చిన సర్వే ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. పరిష్కారాల కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని ముస్లిం పిటిషనర్లను ఆదేశించింది. మసీదు నిర్వహణ కమిటీకి చెందిన ముస్లిం పిటిషనర్లు ముందుగా ఉన్న ఆలయంపై మసీదును నిర్మించారా అనే దానిపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే కోసం వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది.
Also Read: PSLV-C56: మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఒకేసారి ఏడు ఉపగ్రహాలు నింగిలోకి..
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అలహాబాద్ హైకోర్టులో వారణాసి కోర్టు ఇచ్చిన శాస్త్రీయ సర్వే ఆదేశాలను సవాలు చేయడానికి జ్ఞాన్‌వాపి మసీదు నిర్వహణ కమిటీకి కొంత సమయాన్ని ఇచ్చింది. ఈరోజు మసీదు ప్రాంగణంలో సర్వే చేసేందుకు 30 మంది సభ్యుల బృందాన్ని పంపిన ఏఎస్‌ఐకి తన ఆదేశాలను తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ తరఫు సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ మాట్లాడుతూ.. నిర్మాణ ప్రాంగణంలో ఏఎస్‌ఐ సర్వేకు సంబంధించి జిల్లా కోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని అన్నారు. వారణాసి జిల్లా కోర్టు ఏఎస్‌ఐ సర్వే ఆదేశాలకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించేందుకు ముస్లిం పిటిషనర్లకు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.
Also Read: Parliament: పార్లమెంట్‌లో గందరగోళం.. ఉభయసభలను కుదిపేస్తున్న మణిపూర్ అంశం
గత శుక్రవారం (జూలై 21) వారణాసి జిల్లా జడ్జి ఏకే విశ్వేష్ సర్వే ప్రక్రియకు సంబంధించిన వీడియోలు, ఛాయాచిత్రాలతో పాటు ఆగస్టు 4లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ఏఎస్‌ఐని ఆదేశించారు. జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహణకు అనుమతించాలంటూ హిందువుల తరఫున విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది పిటిషన్ వేశారు. దీనిపై వారణాసి జిల్లా కోర్టు జులై 14న వాదనలు విన్నది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించి సర్వేకు అనుమతిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. అయితే శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఏఎస్‌ఐ సర్వేను జులై 26 వరకు నిర్వహించవద్దని.. జ్ఞాన్‌వాపి మసీదు నిర్వహణ కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది.
