NTV Telugu Site icon

Khattar Govt: హర్యానా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. 22న చర్చ

Katar

Katar

దేశంలో మరో రాష్ట్రం బలపరీక్షను ఎదుర్కోబోతుంది. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో జరిగాయి. జార్ఖండ్, బీహార్, ఢిల్లీ ప్రభుత్వాలు వరుసగా విశ్వాస పరీక్షలు ఎదుర్కొన్నాయి. జార్ఖండ్‌లో చంపయ్ సోరెన్ ప్రభుత్వం ఫ్లోర్‌టెస్ట్‌లో గెలిచింది. అలాగే బీహార్‌లో నితీష్‌కుమార్ సర్కార్ గెలిచింది. ఇటీవల కేజ్రీవాల్ కూడా విశ్వాస పరీక్షకు వెళ్లి నెగ్గారు. తాజాగా హర్యానా ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి స్పీకర్ చంద్ గుప్తా అంగీకారం తెల్పుతూ ఫిబ్రవరి 22న అసెంబ్లీలో చర్చకు అనుమతిచ్చారు.

హర్యానా ప్రభుత్వంపై అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ జియాన్ చంద్ గుప్తా (Speaker Gian Chand Gupta) అంగీకరించారు. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై (Manohar Lal Khattar government) అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన చర్చను 22న నిర్వహిస్తామని తెలిపారు. ఇటీవల ప్రతిపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా (Bhupinder Singh Hooda).. ఖట్టర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం తీసుకువస్తుందని ఆయన ముందే చెప్పారు.

మూడేళ్ల క్రితం బీజేపీ-జేజేపీ (జననాయక్ జనతా పార్టీ) ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం తెచ్చినా అది వీగిపోయింది. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్ గతంలోని అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావించారు. ప్రతి సెషన్‌లో తమ ప్రభుత్వం చేసిన పని గురించి తెలుసుకోవడానికి ప్రతిపక్షాలు తప్పనిసరిగా అలాంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ మళ్లీ అవిశ్వాస తీర్మానం తీసుకు వస్తే.. ప్రభుత్వం చేసిన పనుల గురించి వారు మళ్లీ వినాల్సివస్తుందని ఖట్టర్ చెప్పుకొచ్చారు.

బలాబలాలు ఇలా..
హర్యానా అసెంబ్లీలో 90 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక భాగస్వామి (జేజేపీ)కి 10 మంది ఉన్నారు. అలాగే సభలోని ఏడుగురు స్వతంత్ర సభ్యుల్లో ఆరుగురు బీజేపీకి మద్దతిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలుండగా.. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి)కి ఒకరు మద్దతుగాఉన్నారు. దీని బట్టి సునాయసంగా ఖట్టర్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొనే సత్తా ఉంది. మరీ ఏం జరుగుతుందో ఎల్లుండి తేలిపోనుంది.