‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నిఖిల్, తన 22వ చిత్రంగా వస్తున్న ‘స్వయంభూ’ కోసం ఎంతలా కష్టపడ్డారో తాజా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గడిచిన రెండేళ్లుగా నేను ఎవ్వరికీ కనిపించలేదు, అంతలా ఈ సినిమా కోసం కష్టపడ్డాను. ‘హ్యాపీడేస్’ వచ్చి 19 ఏళ్లవుతోంది, ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. కానీ ప్రేక్షకులు ఎప్పుడూ నాకు అండగానే ఉన్నారు” అని ఎమోషనల్ అయ్యారు. ‘స్వయంభూ’ ఒక కల్పిత కథ కాదని, రాయలసీమలో నిజంగా జరిగిన ఒక యువకుడి యదార్థ గాథ అని నిఖిల్ వెల్లడించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకూడదనే ఉద్దేశంతోనే సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Also Read : Drishyam 3 : దృశ్యం 3’పై ప్రకాష్ రాజ్ క్లారిటీ
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ మరియు వీఎఫ్ఎక్స్ పనుల కోసం మరికొంత సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది. “నిఖిల్ మా వాడు అనేలా ఈ సినిమా కోసం ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేశాను” అని నిఖిల్ చెప్పడం చూస్తుంటే, టెక్నికల్‌గా ఈ సినిమా మరో లెవల్‌లో ఉండబోతోందని అర్థమవుతోంది. రవి బస్రూర్ సంగీతం, నిఖిల్ మేకోవర్ ఇప్పటికే అంచనాలను భారీగా పెంచేశాయి. యదార్థ గాథ నేపథ్యంలో వస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
