Site icon NTV Telugu

Nigeria: ఘోర రోడ్డుప్రమాదం.. జాతీయ క్రీడల నుంచి వస్తూ 21 మంది క్రీడాకారులు మృతి..!

Nigeria

Nigeria

Nigeria: నైజీరియాలో తాజాగా ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఓగున్ రాష్ట్రంలోని జాతీయ క్రీడలను ముగించుకుని తిరిగివస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో 21 మంది క్రీడాకారులు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నైజీరియా క్రీడా ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ దుర్ఘటన శనివారం చోటు చేసుకుంది. ప్రమాదం కానోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దకాసోయే పట్టణం వద్ద జరిగింది. ఓగున్ రాష్ట్ర రాజధాని అబేఒకుటా నుంచి ప్రయాణిస్తున్న కోస్టల్ బస్సు రాత్రంతా ప్రయాణించి ఉదయం 9 గంటల సమయంలో ఓ వంతెనపై నుండి అదుపుతప్పి కింద పడిపోయింది.

Read Also: Rinku Singh: రింకు సింగ్ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఫిక్స్.. జూన్ 8న నిశ్చితార్థం

ఈ ఘటన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా 15 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని కురా జనరల్ హాస్పిటల్, ముర్తాలా మొహమ్మద్ స్పెషలిస్ట్స్ హాస్పిటల్, కానోలకు తరలించారు. మరణించిన వారిలో యువ క్రీడాకారులు, సీనియర్ జర్నలిస్టు, వైద్య సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్ అధికారుడు, క్రీడా నిర్వాహకులు ఉన్నారు. ఈ సంఘటనను మరో బస్సులో ప్రయాణిస్తున్న సీనియర్ క్రీడా జర్నలిస్టు ఆడో సలిసు ధృవీకరించారు.

Read Also: Gun Firing: ఇలా ఉన్నారేంట్రా బాబు.. పది రూపాయల సిగరెట్ ఇవ్వలేదని దుకాణంపై గన్‌ ఫైరింగ్.. చివరకు..?

అధికారులు ఇంకా అధికారికంగా కారణాలు వెల్లడించనప్పటికీ.. అక్కడి రహదారి పరిస్థితులు, అలాగే రాత్రంతా ప్రయాణం చేయడం వల్ల ప్రమాదానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. నైజీరియా క్రీడా సంఘాలు ఈ దుర్ఘటనపై తీవ్రంగా స్పందించాయి. అంతరాష్ట్ర ప్రయాణాల్లో క్రీడాకారుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరణించిన వారి కుటుంబసభ్యులు, సహచరులు వారి కోల్పోయిన ప్రతిభను స్మరించుకుంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. నైజీరియా క్రీడల అభివృద్ధిలో వారికి చేసిన సేవలను గుర్తు చేస్తూ దేశమంతటా నివాళులు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version