West Indies beat India in 2nd T20I: టీ20ల్లో తాము ఎంత ప్రమాదకరమో వెస్టిండీస్ మరోసారి చూపించింది. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో భారత్‌తో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లోనూ విండీస్ గెలిచింది. 152 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ 8 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ (67; 40 బంతుల్లో 6×4, 4×6) చెలరేగాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా (3/35), యుజ్వేంద్ర చహల్ (2/19) రాణించారు. ఈ విజయంతో 2-0తో ఆధిక్యంలో ఉన్న విండీస్.. 5 మ్యాచ్‌ల సిరీస్ దక్కించుకోవాలంటే మరో మ్యాచ్ నెగ్గితే సరిపోతుంది.
రెండో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మంచి ఆరంభం దక్కలేదు. శుభ్‌మన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (1) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. క్రీజులో కుదురుకున్న ఇషాన్ ఇషాన్ (27)కు తిలక్ వర్మ (51; 41 బంతుల్లో 5×4, 1×6) జత కలిశాడు. ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే ధాటిగా ఆడే ప్రయత్నంలో ఇషాన్, సంజూ శాంసన్ (7) పెవిలియన్ చేరడంతో 12 ఓవర్లకు 79/4తో నిలిచింది.
ఈ సమయంలో తిలక్ వర్మ చెలరేగాడు. ఈ క్రమంలో 39 బంతుల్లో తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ చేశాడు. తిలక్ జోరుతో 15 ఓవర్లలో భారత్ స్కోర్ 106/4తో నిలిచింది. కీలక సమయంలో తిలక్, హార్దిక్ పాండ్యా (24) నిష్క్రమించడంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. అర్ష్‌దీప్ (6 నాటౌట్), రవి బిష్ణోయ్ (8 నాటౌట్) పరుగులు చేయడంతో భారత్ స్కోర్ 150 దాటింది. కరీబియన్ బౌలర్లలో అల్జారి జోసెఫ్ (2/28), అకీల్ హోసీన్ (2/29), రొమారియో షెఫర్డ్ (2/28) తలో రెండు వికెట్స్ పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో విండీస్ తొలి ఓవర్లోనే రెండు వికెట్స్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కింగ్ (0), ఛార్లెస్ (2) ఔట్ అయ్యారు. దాంతో బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై విండీస్ బ్యాటర్లు నిలబడడం కష్టమే అనిపించింది. కానీ నికోలస్ పూరన్ ఆ అవకాశం ఇవ్వలేదు. ఆరంభంలోనే రివ్యూతో బతికిపోయిన పూరన్.. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్‌లతో చెలరేగాడు. ఈ క్రమంలోనే 29 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. మరోవైపు పావెల్ (21), హెట్‌మయర్ (22) కూడా ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో పూరన్ పెవిలియన్ చేరాడు.
15వ ఓవర్లో రవి బిష్ణోయ్ ఒక్క పరుగే ఇచ్చాడు. ఆపై చహల్ బౌలింగ్‌లో షెఫర్డ్ (0) రనౌట్ కాగా.. హోల్డర్ (0) స్టంపౌట్ అయ్యాడు. ఇక హెట్‌మయర్ ఎల్బీగా వెనుదిరగడంతో ఉత్కంఠ రేగింది. ముకేశ్ కుమార్ వేసిన 17వ ఓవర్లో 3 పరుగులే రావడంతో.. విండీస్ సమీకరణం 18 బంతుల్లో 21గా మారింది. అకీల్ (16 నాటౌట్), జోసెఫ్ (10 నాటౌట్) క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చారు. 18వ ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ 9 పరుగులు ఇవ్వడం భారత్‌ను దెబ్బతీసింది. మూడో టీ20 మంగళవారం జరుగుతుంది.