Supreme Court: హైవేలపై వీధి పశువుల సమస్య పరిష్కారానికి రూ.5 వేల కోట్లు.. చేతులెత్తేసిన ఎన్‌హెచ్‌ఏఐ

Nhai Supreme Court

Nhai Supreme Court

Supreme Court: జాతీయ రహదారులపై (National Highways) విచ్చలవిడిగా తిరుగుతున్న వీధి పశువుల సమస్యపై భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) సుప్రీంకోర్టులో (Supreme Court) చేతులెత్తేసింది. హైవేలపై నుంచి పశువులను తరలించడానికి గానీ, టోల్ ప్లాజాల (Toll Plazas) వద్ద వాటి కోసం ప్రత్యేక షెల్టర్లు నిర్మించడానికి గానీ తమ వద్ద తగినన్ని నిధులు లేవని, అసలు అలా చేసే చట్టపరమైన అధికారం కూడా తమకు లేదని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 1.46 లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నేషనల్ హైవే నెట్‌వర్క్‌లో (Highway Network) ఈ పనులు చేపట్టాలంటే రూ. 5,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని అథారిటీ అంచనా వేసింది. భూసేకరణ (Land Acquisition), షెల్టర్ల నిర్మాణం, పశువులకు దాణా, నీటి వసతి కల్పించడం వంటి వాటికి ఇంత భారీ బడ్జెట్ అవసరమవుతుందని, తమ వద్ద అంత డబ్బు లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు.

టోల్ వసూళ్ల (Toll Revenue) ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం రోడ్ల నిర్మాణం, వాటి నిర్వహణ, పాత అప్పులు తీర్చడానికి మాత్రమే ఉపయోగిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. పశువుల సంరక్షణ కోసం తమ వద్ద ఎలాంటి ప్రత్యేక బడ్జెట్ లేదని పేర్కొంది. తమ ప్రధాన బాధ్యత కేవలం రోడ్లు వేయడం, వాటిని మెయింటైన్ చేయడం మాత్రమేనని అథారిటీ వాదించింది. వీధి పశువులను పట్టుకోవడం, వాటికి చికిత్స అందించడం, షెల్టర్లు ఏర్పాటు చేయడం వంటి పనులకు ప్రత్యేక సిబ్బంది, మౌలిక సదుపాయాలు కావాలని, ఇవన్నీ తమ పరిధిలోకి రావని తేల్చి చెప్పింది. రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనల ప్రకారం వీధి పశువులను నియంత్రించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు (State Governments), జిల్లా యంత్రాంగం, మున్సిపాలిటీలదేనని (Municipal Bodies) ఎన్‌హెచ్‌ఏఐ గుర్తు చేసింది.

అయితే, ఎన్‌హెచ్‌ఏఐ వాదనలపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌.వి. అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైవేలపై పశువుల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు (Road Accidents), ప్రాణనష్టంపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టోల్ ప్లాజాల దగ్గరే పశువుల కోసం షెల్టర్లు నిర్మించే ఆలోచన చేయాలని సూచించింది. నిధుల కొరత ఉందన్న ఎన్‌హెచ్‌ఏఐ వాదనను తోసిపుచ్చుతూ, ఈ పని కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR Funds) నిధులను ఎందుకు వాడుకోకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇదిలా ఉండగా.. గతేడాది నవంబర్ (November 2025)లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ ఆదేశంతో ఈ వివాదం మొదలైంది. పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు, వీధి కుక్కల దాడులను దృష్టిలో ఉంచుకుని, హైవేలు, బహిరంగ ప్రదేశాల నుంచి వీధి పశువులు, కుక్కలను తొలగించి షెల్టర్లకు తరలించాలని అప్పట్లో కోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ఎన్‌హెచ్‌ఏఐకి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ తన అభ్యంతరాలను, ఆర్థిక పరిస్థితిని కోర్టు ముందుంచింది.