Site icon NTV Telugu

Trump: ట్రంప్‌‌కు కోర్టులో ఝలక్.. ఆస్తుల స్వాధీనానికి ఆదేశం

Trumo

Trumo

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఆస్తుల జప్తునకు ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు న్యూయార్క్ అధికారులు చర్యలు చేపట్టారు. రెండు ఆస్తులను సీజ్‌ చేయవచ్చని తెలుస్తోంది.

ట్రంప్‌ ఆస్తుల స్వాధీనానికి న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ చర్యలు మొదలుపెట్టారు. చీటింగ్ కేసులో 355 మిలియన్‌ డాలర్లు, దానిపై వడ్డీని చెల్లించాలని ఆయన్ను, ఆయన కుమారులు జూనియర్‌ ట్రంప్‌, ఎరిక్‌ ట్రంప్‌, ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ను న్యూయార్క్‌ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఈ మొత్తం 454 మిలియన్‌ డాలర్లకు చేరింది. చెల్లింపుల విషయంలో ట్రంప్‌ ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడంతో అటార్నీ జనరల్‌ ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఉత్తర మాన్‌హట్టన్‌లోని ఆయన ప్రైవేటు ఎస్టేట్‌ సెవన్‌ స్ప్రింగ్స్‌, గోల్ఫ్‌ కోర్సు స్వాధీనం చేసుకునే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆస్తుల విలువపై అసత్యాలు చెప్పి బ్యాంకులు, బీమా కంపెనీలను మోసం చేశారని న్యూయార్క్‌ న్యాయస్థానం తెలిపింది. ఈ కేసు ఓడిపోతే కచ్చితంగా అపరాధ రుసుం చెల్లించేలా గ్యారెంటీ మొత్తాన్ని ఇచ్చి తీరాలని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇది రాజ్యాంగ విరుద్ధమని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

సెవన్‌ స్ప్రింగ్స్‌ ఎస్టేట్‌ దాదాపు 230 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిని 1919లో నిర్మించారు. ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ 7.5 మిలియన్‌ డాలర్లుకు 1996లో కొనుగోలు చేసింది. దీనిని సమూలంగా మార్చాలని ట్రంప్‌ భావించినా ఆ ప్రణాళిక అమలు కాలేదు. ఆయన కుటుంబం తరచూ ఈ ఎస్టేట్‌కు వస్తూపోతుంటారు. ఆయన గోల్ఫ్‌ కోర్స్‌లో 75,000 చదరపుటడుగుల క్లబ్‌ హౌస్‌ ఉంది. దీనిని 1922లో ఏర్పాటు చేశారు.

ట్రంప్‌పై ఇప్పటికే పలు కేసుల్లో నేరాభియోగాలు నమోదయ్యాయి. ఇటీవల లైంగిక వేధింపులకు సంబంధించిన పరువునష్టం కేసులో అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌కు 83.3 మిలియన్‌ డాలర్లు అదనంగా చెల్లించాలని మాన్‌హటన్‌ ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో అంతకుముందు ఆయనకు 5 మిలియన్‌ డాలర్ల జరిమానా పడింది.

ప్రస్తుతం ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ పడుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను ఢీకొంటున్నారు. ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరగనున్నాయి.

Exit mobile version