NTV Telugu Site icon

New Year Celebrations : రెండు రోజుల్లో రూ.680కోట్ల మద్యం అమ్మకాలు

Liquor Supply Stopped

Liquor Supply Stopped

New Year Celebrations : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం లభించింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.680 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, డిసెంబర్ 31న రూ.282 కోట్ల విలువైన అమ్మకాలు, డిసెంబర్ 30న రూ.402 కోట్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 వైన్స్ షాపులు, 1117 బార్లు, రెస్టారెంట్లు, పబ్‌ల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం ఉదయం 2 గంటల వరకు ఎక్సైజ్ శాఖ 40 ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడుల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. రెండు చోట్ల 313 గ్రాముల గంజాయి పట్టుబడింది. ఒక పబ్ పరిసర ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల వద్ద డ్రగ్స్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. నిషేధిత మద్యం, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని డైరెక్టర్ అభినందించారు.

నూతన సంవత్సర వేడుకల కోసం ఎక్సైజ్ శాఖ మొత్తం 287 ఈవెంట్లకు అనుమతులు మంజూరు చేసింది. ఈ అనుమతుల ద్వారా రూ.56.46 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 243 అనుమతులు, మిగిలిన జిల్లాల్లో 44 అనుమతులు ఇచ్చారు. డిసెంబర్ 31న మంజూరు చేసిన 224 అనుమతుల ద్వారా రూ.44.76 లక్షలు వచ్చినట్లు వెల్లడించారు. ఈ వేడుకల సందర్భంగా ఎక్సైజ్ శాఖ తగిన నిఘా ఏర్పాటు చేసి, మద్యం అమ్మకాల పర్యవేక్షణతో పాటు అక్రమ కార్యకలాపాలను అడ్డుకుంటూ విజయవంతంగా నిర్వహించింది.