New Rules from January 1: మరోవారం రోజుల్లో 2025 ముగియనుండగా.. కొత్త ఏడాది 2026 నుంచి అనేక విధాన, నియంత్రణ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇవి రైతులు, ఉద్యోగులు, సాధారణ ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. జనవరి 1 నుండి బ్యాంకింగ్ నిబంధనలు, సోషల్ మీడియా నియంత్రణలు, ఇంధన ధరలు, ప్రభుత్వ పథకాలు వంటి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. మరి ఎంటువంటి మార్పులు రాబోతున్నాయి ఒకసారి చూసేద్దామా..
బ్యాంకింగ్ నిబంధనలు:
క్రెడిట్ స్కోర్ అప్డేట్ విధానంలో కీలక మార్పు రానుంది. ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి నవీకరణలు జరిగితే.. ఇకపై ప్రతి వారం క్రెడిట్ బ్యూరోలు కస్టమర్ డేటాను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో క్రెడిట్ స్కోర్ మరింత ప్రభావితం కానుంది. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రధాన బ్యాంకులు ఇప్పటికే రుణ వడ్డీ రేట్లు తగ్గించాయి. ఈ నిర్ణయం కొత్త సంవత్సరంలో రుణాలు తీసుకున్న వారికి లాభం చేకూర్చనుంది. అలాగే, జనవరి 2026 నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లలో కూడా మార్పులు అమలుకానున్నాయి. అలాగే యూపీఐ, డిజిటల్ చెల్లింపులపై నిబంధనలు మరింత కఠినతరం అవనున్నాయి. అలాగే పాన్ కార్డు, ఆధార్ లింకేజీపై కఠిన అమలు జరగనుంది. జనవరి 1 నుంచి పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఇది లేకపోతే బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది.
సోషల్ మీడియా నియంత్రణ:
16 ఏళ్ల లోపు పిల్లల కోసం కఠినమైన సోషల్ మీడియా నిబంధనలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాల తరహాలో వయస్సు ఆధారిత పరిమితులు, తల్లిదండ్రుల నియంత్రణలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇంకా వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్స్‌లో మోసాలను అరికట్టేందుకు సిమ్ వెరిఫికేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు.
ట్రాఫిక్ నియంత్రణలు:
కాలుష్య నియంత్రణలో భాగంగా పలు నగరాల్లో డీజిల్, పెట్రోల్ వాణిజ్య వాహనాలపై కొత్త ఆంక్షలు అమలు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పెట్రోల్ వాహనాల ద్వారా డెలివరీలపై పరిమితులు విధించే ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి.
India-New Zealand: భారత్‌తో ఒప్పందాన్ని తప్పుపట్టిన న్యూజిలాండ్ మంత్రి.. ‘బ్యాడ్ డీల్’ అంటూ అభ్యంతరం
ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట:
డిసెంబర్ 31తో 7వ వేతన సంఘం గడువు ముగియనున్న నేపథ్యంలో.. జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. అలాగే, జనవరి 2026 నుంచి డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఇది ఉద్యోగులకు కొంత ఊరట ఇవ్వనుంది. హర్యానా వంటి కొన్ని రాష్ట్రాలు పార్ట్‌టైమ్, రోజువారీ కూలీల కనీస వేతనాల పెంపుపై కూడా సమీక్ష చేయనున్నాయి.
రైతులకు కీలక మార్పులు:
ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతులకు ప్రత్యేక యూనిక్ ఐడీలు జారీ చేస్తున్నారు. ఇవి పీఎం కిసాన్ పథకం కింద వచ్చే వాయిదాల కోసం తప్పనిసరి కానున్నాయి. ఐడి లేకపోతే లబ్ధిదారులకు నగదు జమ కాకపోవచ్చు. పీఎం కిసాన్ పంట బీమా పథకం కింద అడవి జంతువుల వల్ల పంట నష్టం జరిగినా పరిహారం పొందే అర్హత రైతులకు కల్పించనున్నారు. అయితే నష్టం జరిగిన 72 గంటల్లోగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
సాధారణ ప్రజలపై ప్రభావం:
జనవరిలో కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది బ్యాంకింగ్ లావాదేవీలు, ఖర్చుల వివరాలతో ముందే నింపబడిన విధంగా ఉండనుంది. దీంతో రిటర్న్ దాఖలు సులభమవుతుందే కానీ, పర్యవేక్షణ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు జనవరి 1 నుంచి ఎల్పీజీ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు సవరించనున్నారు. అదే రోజున విమాన ఇంధనం (ATF) ధరల్లోనూ మార్పులు అమలవుతాయి. ఇవి గృహ బడ్జెట్‌తో పాటు విమాన టికెట్ ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
