Income Tax Regime New Calculator in India: 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మొదలైంది. అంటే.. నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను ప్రారంభమైంది. ఈ ఆర్థిక ఏడాదిలో కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త పన్ను విధానం గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం కేంద్రం దృష్టికి వెళ్లడంతో.. ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ ఎక్స్ ద్వారా స్పందించింది. కొత్త పన్ను విధానంకు సంబంధించి పలు కీలకాంశాలను షేర్ చేసింది.
కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త పన్ను విధానం గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ విషయాలను మీతో పంచుకుంటున్నాం’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆరు అంశాలను వివరించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
# 01.04.2024 నుంచి పన్ను విధానంలో కొత్త మార్పు ఏదీ లేదు.
# సెక్షన్ 115BAC(1A) కింద కొత్త పన్ను విధానం ఆర్థిక చట్టం 2023లో ప్రవేశపెట్టబడింది.
# 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు, సంస్థలు కాకుండా ఇతర వ్యక్తులకు కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా వర్తిస్తుంది.
# కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే పాత పన్ను విధానంలోని మినహాయింపులు, డిడక్షన్స్ (స్టాండర్డ్ డిడక్షన్ 50,000, ఫ్యామిలీ పెన్షన్ 15,000 మినహా)లు కొత్త విధానంలో లేవు.
# కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా వర్తించనుంది. అయితే పన్ను చెల్లింపుదారులు తమకు లాభదాయకంగా భావించే పన్ను విధానాన్ని (పాత లేదా కొత్త) ఎంచుకోవచ్చు.
# 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్న్ ఫైల్ చేసే వరకు కొత్త పన్ను విధానం నుంచి వైదొలగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి వ్యాపార ఆదాయం లేని అర్హులైన వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరానికి తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని, మరొక సంవత్సరంలో పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.
కొత్త పన్ను విధానం 115 BAC (1A):
రూ. 3 లక్షల వరకు 0% పన్ను
రూ. 3-6 లక్షల వరకు 5% పన్ను
రూ. 6-9 లక్షల వరకు 10% పన్ను
రూ. 9-12 లక్షల వరకు 15% పన్ను
రూ. 12-15 లక్షల వరకు 20% పన్ను
రూ. 15 లక్షలకు పైన 30% పన్ను
పాత పన్ను విధానం:
రూ. 2.5 లక్షల వరకు 0% పన్ను
రూ. 2.5 నుంచి 5 లక్షల వరకు 5% పన్ను
రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20% పన్ను
రూ. 10 లక్షలకుపైన 30% పన్ను