Netaji Subhas Chandra Bose Jayanti: జనవరి 23న భారతదేశం మొత్తం ఒక గొప్ప నాయకుడిని గుర్తు చేసుకుంటుంది. ఆయన మామూలు వ్యక్తి కాదు. బ్రిటీషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధీరుడు. శాంతి వల్ల స్వాతంత్ర్యం రాదని, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని దేశ ప్రజలకు రణరంగం వైపు నడిపిన ధీశాలి. ఆయన మరెవరో కాదు సుభాష్ చంద్రబోస్, మనం ప్రేమగా పిలుచుకునే పేరు నేతాజీ. దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన ఈ మహానాయకుడి జయంతి ఈ రోజు. నేడు నేతాజీ త్యాగాలు, ధైర్యం, ఆలోచనల గురించి యువత తప్పకుండా తెలుసుకోవాలి.
READ MORE: Subhash Chandra Bose Jayanti: 70గంటల పని విధానం.. 100ఏళ్ల క్రితం నేతాజీ ఏం చెప్పారు?
స్వాతంత్ర్యం కేవలం మాటలతో రాదని నమ్మిన నాయకుడు సుభాష్ చంద్రబోస్. బ్రిటిష్ పాలనను ఎదిరించాలంటే అవసరమైతే ఆయుధాలతో పోరాటం చేయాల్సిందే అన్న దృఢ సంకల్పం ఆయనది. శాంతియుత పోరాటం ఒక్కటే మార్గం కాదని గ్రహించిన తర్వాత, ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అదే నిర్ణయాలు ఆయన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ నాయకుడిగా నిలబెట్టాయి. చిన్నతనం నుంచే సుభాష్ చంద్రబోస్ ప్రతిభావంతుడు. చదువులో ఎప్పుడూ ముందుండేవారు. ఇంగ్లాండ్‌లో జరిగిన అత్యంత కఠినమైన ఐసీఎస్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించినా, బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతుగా పని చేయలేనని ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. దేశం బానిసగా ఉందని.. ఈ సమయంలో తన వ్యక్తిగత భవిష్యత్తుకంటే దేశ స్వాతంత్ర్యమే ముఖ్యం అని భావించారు.
నేతాజీ ఆలోచనలకు స్వామి వివేకానంద ప్రభావం చాలా ఉంది. ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తి కలిసి నడవాలి అని ఆయన నమ్మేవారు. యువతే దేశ భవిష్యత్తు అని విశ్వసించి, వారిని జాగృతం చేయాలని ప్రయత్నించారు. “నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్ర్యం ఇస్తాను” అన్న నేతాజీ పిలుపు కోట్లాది మంది భారతీయుల హృదయాలను కదిలించింది. నేతాజీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే స్వాతంత్ర్యం సాధించే మార్గం విషయంలో ఇతర నాయకులతో భేదాభిప్రాయాలు రావడంతో, కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. అయినా దేశం కోసం పోరాటం ఆపలేదు. విదేశాల్లో ఉన్నప్పటికీ భారత్ స్వాతంత్ర్యమే ఆయన లక్ష్యంగా కొనసాగింది. జర్మనీలో నుంచి ఆజాద్ హింద్ రేడియో ప్రారంభించి భారతీయులకు ధైర్యం నింపారు. ఈ నేపథ్యంలోనే “జై హింద్” అనే నినాదం పుట్టింది. ఈ నినాదాన్ని దేశానికి అందించినవారు ఆయనే.
నేతాజీ వ్యక్తిగత జీవితం కూడా త్యాగాలతో నిండింది. యూరప్‌లో ఉండగా ఎమ్మిలీ షెంకెల్ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. అయినా దేశ పోరాటమే ఆయన జీవిత లక్ష్యంగా ఉండటంతో కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇది నేతాజీ చేసిన మరో గొప్ప త్యాగం. 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసి, అండమాన్-నికోబార్ దీవులకు “షహీద్”, “స్వరాజ్” అని పేర్లు పెట్టారు. ఇది బ్రిటిష్ పాలనకు సవాల్ చేసిన ధైర్యమైన చర్యగా చరిత్రలో నిలిచిపోయింది. జపాన్ సహాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని ముందుకు నడిపిస్తూ, భారత స్వాతంత్ర్య పోరాటాన్ని కొత్త దశకు తీసుకెళ్లారు. నేతాజీ జీవితం చుట్టూ ఇంకా ఒక రహస్యం ఉంది. 1945లో విమాన ప్రమాదంలో ఆయన మరణించారనే వార్త వచ్చినా, ఇప్పటికీ చాలా మంది బతికే ఉన్నారని నమ్ముతారు. ఈ రహస్యమే చరిత్రలో ఓ లెజెండ్‌గా నిలబెట్టింది. మొత్తానికి, సుభాష్ చంద్రబోస్ జీవితం ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. ఆయన ఆలోచనలు, పోరాటం ఈ రోజుకీ యువతను ప్రేరేపిస్తూనే ఉన్నాయి. నిజమైన నాయకుడు అంటే ఏమిటో చెప్పే జీవితం నేతాజీది.