Site icon NTV Telugu

Nepal vs West Indies: వెస్టిండీస్‌కు క్రికెట్ పాఠం.. చరిత్ర సృష్టించిన పసికూన నేపాల్!

Nepal Cricket

Nepal Cricket

పసికూన నేపాల్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్ట్ ఆడే దేశంపై మొదటిసారి ద్వైపాక్షిక సిరీస్‌ను నేపాల్ గెలుచుకుంది. సోమవారం షార్జా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో విజయం సాధించడంతో ఈ రికార్డు నెలకొల్పింది. రెండో టీ20లో వెస్టిండీస్‌ను 83 పరుగులకే ఆలౌట్ చేసి.. 90 పరుగుల తేడాతో గెలిచింది. మొదటి టీ20లో 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. నామమాత్రమేనా మూడో మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఈ సిరీస్ విజయం నేపాల్‌కు ఎంతో ప్రత్యేకమైనది కాగా.. మాజీ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌కు ఓ పాఠం అనే చెప్పాలి.

రెండో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. ఓపెనర్ ఆషిఫ్ షేక్ 68 పరుగులు చేయగా, సందీప్ జోరా 63 పరుగులు చేశాడు. వెస్టిండీస్ స్పిన్నర్లు అకేల్ హొస్సేన్, కైల్ మేయర్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 174 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ 83 పరుగులకే కుప్పకూలింది. జాసన్ హోల్డర్ 21 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. అమీర్ జాంగూ 16 పరుగులు చేశాడు. 8 మంది బ్యాట్స్‌మెన్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. నేపాల్ బౌలర్లు మహ్మద్ ఆదిల్ ఆలం నాలుగు వికెట్లు పడగొట్టగా.. కుశాల్ భూర్టెల్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో నేపాల్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.

Also Read: Colder Winter: దుప్పట్లు రెడీ చేసుకోండమ్మా.. మరో 4-5 రోజుల్లో ఎముకలు కొరికేంత చలి!

నేపాల్ 2014లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి.. సిరీస్‌ను గెలుచుకుంది. కానీ ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ అసోసియేట్ సభ్యదేశంగా ఉంది. అప్పుడు టెస్ట్ హోదా లేదు. ఇప్పుడు వెస్టిండీస్‌ను ఓడించి రికార్డుల్లో నిలిచింది. ఈ ఓటమితో విండీస్ జట్టు పరువు మరీ దిగజారిపోయింది. మాజీలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నా.. బోర్డు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవలి కాలంలో టీ20లలో కాస్త మెరుగైన ప్రదర్శన చేసింది. ఇప్పుడు పసికూనపై కూడా ఓడిపోవడంతో ఆ జట్టు ప్రదర్శన ఎంతగా దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌ సిరీస్‌కు ముందు నేపాల్ అద్భుత ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియాలో బంగ్లాదేశ్ ఏ, పాకిస్తాన్ షాహీన్స్ సహా అనేక ఆస్ట్రేలియన్ అకాడమీలు అండ్ క్లబ్‌లతో టాప్ ఎండ్ ప్రదర్శన ఇచ్చింది.

Exit mobile version