Nepal PM KP Sharma Oli Resigns: నేపాల్‌లో పరిస్థితి దిగజారుతోంది. నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఖాట్మండుతో సహా అనేక ప్రాంతాల్లో నిరసన కారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. నిరసనకారులు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ వ్యక్తిగత నివాసాన్ని ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ నిరసనల నేపథ్యంలో నేపాల్ ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే హోం మంత్రి రమేష్ లేఖక్, వ్యవసాయ మంత్రి రామ్‌నాథ్ అధికారి, ఆరోగ్య మంత్రి సహా ఐదుగురు మంత్రులు రాజీనామా చేశారు. పెరుగుతున్న ఒత్తిడి మధ్య పీఎం ఓలి చికిత్స పేరుతో దుబాయ్ వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఉప ప్రధాన మంత్రికి తాత్కాలిక బాధ్యతను అప్పగించాలని నిర్ణయించుకున్నారు.
READ MORE: Perni Nani : కూటమి ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లే మిగిలాయి..పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు
అసలు ఏం జరిగింది?
ప్రస్తుతం సమాజాన్ని సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. సోషల్ మీడియా లేకుండా రోజు గడవని పరిస్థితులున్నాయి. అన్నింటికీ సోషల్ మీడియానే ఆధారం అయింది. అలాంటి సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ సహా 18 సామాజిక మాధ్యమాలపై కేపీ శర్మ ఓలి ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించింది. ముఖ్యంగా యువతలో ఆగ్రహావేశాలు రప్పించింది. వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయాలంటూ దాదాపు 10 వేల మంది నిరసనకారులు రాజధాని ఖాట్మండును ముట్టడించారు. ‘‘సోషల్ మీడియాపై నిషేధం కాదు.. అవినీతిపై నిషేధం విధించండి’’ అంటూ నినాదం ఎత్తుకున్నారు. ఒక దశలో పార్లమెంట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. దీంతో భద్రతా దళాలు అడ్డుకునే క్రమంలో తుపాకులకు పని చెప్పారు. పోలీసుల కాల్పుల్లో 20 మంది చనిపోగా.. వందలాది మంది గాయాలపాలయ్యారు. ఇది మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరసనకారులు మరింత రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు.
