Nepal Helicopter Collision: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. రెండు హెలికాప్టర్లు ఢీకొని భారతీయుడు దుర్మరణం!

Nepal Mid Air Helicopter

Nepal Mid Air Helicopter

Nepal Helicopter Collision: నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోలుఖుంబు జిల్లాలో మంగళవారం ఉదయం రెండు హెలికాప్టర్లు మిడ్-ఎయిర్‌లో ఢీకొనడంతో ఓ భారతీయుడు దుర్మరణం పాలయ్యారు. రాజధాని ఖాట్మండుకు దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లాట్‌ఫారమ్‌పై ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఫిష్‌టైల్ ఎయిర్, డైనాస్టీ ఎయిర్‌ సంస్థలకు చెందిన రెండు హెలికాప్టర్లు ఖుంబు పసాంగ్ లహాము ప్యాకేజీలోని పెరిచే హెలిప్యాడ్‌పై ఒకే సమయంలో దిగేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో రెండింటి రోటర్ బ్లేడ్లు పరస్పరం బలంగా ఢీకొన్నాయని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. ప్రమాద తీవ్రతకు సంబంధించిన భయంకరమైన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఈ ప్రమాదంలో విదేశీయుడైన ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి భారతీయుడని ప్రాథమికంగా గుర్తించినప్పటికీ, అతని పేరు, పూర్తి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే మృతదేహాన్ని హెలికాప్టర్‌ ద్వారా లుక్లా ప్రాంతానికి తరలించారు. ఇక తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని అత్యవసర వైద్య చికిత్స కోసం వెంటనే వేరే హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలంలో సోలుఖుంబు జిల్లా పోలీస్ ఆఫీస్ డీఎస్పీ నబీన్‌రాజ్ బుధాథోకి నేతృత్వంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై ఏవియేషన్ అథారిటీ సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ స్పందిస్తూ.. హెలికాప్టర్లు ఎలా ఢీకొన్నాయనే దానిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. కాగా, నేపాల్‌లోని పర్వత ప్రాంతాల్లో పర్యాటకులు, ట్రైక్కర్ల రవాణాకు, నిత్యావసర సరుకులు పంపడానికి, అత్యవసర సహాయక (రెస్క్యూ) చర్యల కోసం ఇలాంటి చిన్న హెలికాప్టర్లనే విస్తృతంగా ఉపయోగిస్తుంటారు.