NTV Telugu Site icon

Nepal-India: ఇండియా భూభాగాలపై నేపాల్ పార్లమెంట్ లో చర్చ

Kali Map.jpg

Kali Map.jpg

నేపాల్ మరోసారి తన బుద్ధిని బయటపెట్టింది. మనం మిత్రదేశంగా భావిస్తున్నప్పటికీ.. భారత భూభాగాలపై ఎప్పటికప్పుడు పేచీ పెడుతూనే ఉంది. గతంలో ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలీ చైనాకు మద్దతుగా ఉండీ.. భారత్ భూభాగాలైన లిపులేక్, లింఫియాధురా, కాలాపానీ ప్రాంతాలను తమ దేశానికి చెందినవిగా వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మరోసారి నేపాల్ ఈ మూడు ప్రాంతాలపై పార్లమెంట్ లో చర్చించింది. ఈ మూడు ప్రాంతాలపై నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కీలక ప్రకటన చేశారు. ఈ సమస్యను ఇరు దేశాలు దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న విధానాల్లో ఈ వివాదాస్పద ప్రాంతాల సమస్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. నేపాల్ తన భూభాగాలను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. సరిహద్దు సమస్య చాలా సున్నితమైనదని.. నేపాల్ కు లిఫులేక్, లింపియాదురా, కాలాపానీ ప్రాంతాలపై అవగాహన ఉందని అన్నారు. నేపాల్ అలీన విధానాన్ని అనుసరిస్తుందని.. జాతీయ ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు.

ఈ వివాదం 2019, నవంబర్ లో ప్రారంభం అయింది. భారత్ జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కొత్తగా ఇండియా మ్యాప్ విడుదల చేసింది. ఆ సమయంలో దీంట్లో కాలాపానీ రిజియన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిత్తోర్ గఢ్ జిల్లాలో భాగంగా చూపింది. దీంతో నేపాల్, ఇండియాల మధ్య వివాదం రాజుకుంది. దీన్ని వ్యతిరేఖిస్తూ 2020, జనవరిలో నేపాల్ దిగువ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇటీవల భారత్ లిపులేక్ వద్ద భారత్ రోడ్డు నిర్మాణాలు చేపట్టడాన్ని నేపాల్ వ్యతిరేఖించింది. ఈ మూడు ప్రాంతాలు భౌగోళికంగా, రక్షణ పరంగా కీలక ప్రాంతాలు. అయితే కేపీ ఓలీ శర్మ నేపాల్ ప్రధానిగా ఉన్న సమయంలో చైనాతో అంటకాగే వాడు. భారత్ అంటే పూర్తిగా వ్యతిరేఖించేవాడు. దీంతో భారత్ పై ఈ వివాదాస్పద ప్రాంతాలను అడ్డు పెట్టుకుని తీవ్రంగా విమర్శలు చేశాడు. కరోనా భారత్ లోనే పుట్టిందని.. శ్రీరాముడు జన్మస్థలం నేపాలే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.