Indo-Nepal: అన్నీ అనుకున్నట్లు జరిగితే నేపాల్ సైన్యంలో ‘మేడ్ ఇన్ ఇండియా’ ముద్ర కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ నేపాల్ సైన్యంలో భారత ముద్ర ఏంటని ఆలోచిస్తున్నారా.. నేపాల్ సైన్యం త్వరలో కాన్పూర్‌లో తయారు చేసిన అధిక నాణ్యత యూనిఫాంలు, బూట్లను వినియోగించనుంది. దీనితో భారతదేశం, నేపాల్ మధ్య రక్షణ సహకారం కొత్త కోణాన్ని సంతరించుకునే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇంతకీ నేపాల్ సైన్యానికి భారత ఉత్పత్తులు అందాయా, మిగితా కథ ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: OG : సమస్యలు లేకుండా OG విడుదల చెయ్యిస్తా.. ఎన్టీఆర్ ని తిట్టిన ఎమ్మెల్యే కీలక ప్రకటన!
నేపాల్ సైన్యానికి నమూనాలు అందజేత..
భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కాన్పూర్‌కు చెందిన DPSU అయిన ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ (TCL) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తమ ఉత్పత్తుల నమూనాలను ఇప్పటికే నేపాల్ సైన్యానికి అందించాయి. ఈ నమూనాలను నేపాల్ సైన్యం మాస్టర్ జనరల్ ఆఫ్ ఆర్డినెన్స్ (MGO) ప్రశంసించింది. ఈ నమూనాలను విజయవంతంగా పరీక్షించిన తర్వాత, కాన్పూర్‌లోని ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీ (OEF)లో 50 వేల జతల బూట్లను తయారు చేయడానికి త్వరలో ఆర్డర్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నేపాల్‌లో ఇటీవల సంవత్సరాలలో మారుతున్న రాజకీయ, ప్రాంతీయ భద్రతా సవాళ్ల దృష్ట్యా ఆ దేశ సైన్యం సంసిద్ధతను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే నేపాల్ ఆర్మీ.. ఆధునిక, మన్నికైన సైనిక పరికరాలను సమకూర్చుకొని తమను తాము సన్నద్ధం చేసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా వారు విదేశీ సరిహద్దులలో నిఘాను పెంచడానికి విశేష ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. ఈ చర్యలకు భారతదేశం గణనీయమైన మద్దతును అందిస్తోంది. భారత సైన్యం కోసం అధిక-నాణ్యత సైనిక పరికరాలను తయారు చేస్తున్న కాన్పూర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఇప్పుడు నేపాల్ సైన్యం అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాయి.
భారత నమూనాలకు నేపాల్ ఆర్మీ అధికారుల ప్రశంసలు..
కాన్పూర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో తయారు చేసిన డిజిటల్ ప్యాట్రన్డ్ యూనిఫాంలు, మాడ్యులర్ గ్లోవ్స్, మల్టీపర్పస్ బూట్లు, బూట్ క్రాంపాన్స్, సెవెన్-లేయర్ ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ వెదర్ క్లోతింగ్ సిస్టమ్ (ECWCS), రాక్ పిటాన్స్, కారాబైనర్‌లతో సహా ఉత్పత్తులను తనిఖీ చేసి, వాటి నాణ్యతను ప్రశంసించారు. రెండు నెలల క్రితం నేపాల్ ఆర్మీకి చెందిన MGO భారత్‌లోని TCL ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి అక్కడ తయారు చేసిన ఉత్పత్తులను తనిఖీ చేసింది. ఈ ఉత్పత్తుల నాణ్యత, సాంకేతిక లక్షణాలు వారిని ఆకట్టుకున్నాయి. ఆర్డర్ ప్రక్రియను కొనసాగించాలనే నిర్ణయానికి వారు వచ్చినట్లు సమాచారం. కాన్పూర్‌లోని ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీ (OEF) నేపాల్ సైన్యానికి మాత్రమే కాకుండా భారత సైన్యానికి కూడా పెద్ద ఎత్తున సైనిక పరికరాలను తయారు చేస్తోంది. ఇటీవల ఈ ఫ్యాక్టరీకి భారత సైన్యానికి 1 మిలియన్ జతల బూట్ల కోసం ఆర్డర్ అందింది. TCL డైరెక్టర్ (ఆపరేషన్స్) రాజీవ్ శర్మ మాట్లాడుతూ.. TCL ఉత్పత్తి సౌకర్యాలలో తయారు చేసిన బూట్లు, డిజిటల్ నమూనా యూనిఫామ్‌లను నేపాల్ సైన్యం ఎంతో అభినందించిందని పేర్కొన్నారు. నమూనా పరీక్ష తర్వాత త్వరలో ఆర్డర్‌లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరుదేశాల రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం..
భారతదేశం – నేపాల్ మధ్య దీర్ఘకాల స్నేహపూర్వక సంబంధాలు, రక్షణ రంగంలో సహకారం ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని తాజా నిర్ణయం మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ సైన్యానికి కాన్పూర్‌లో తయారు చేసిన పరికరాల సరఫరా ఆర్థిక దృక్కోణం నుంచి ముఖ్యమైనది మాత్రమే కాకుండా, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు. ప్రాంతీయ, సరిహద్దు సవాళ్లను ఎదుర్కొంటున్న నేపాల్ సైన్యం ఇప్పుడు భారత సాంకేతికత, నైపుణ్యంతో సాధికారత పొందుతుందని అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Mohammad Yunus: పాపం యూనస్..! అమెరికా సాక్షిగా ఘోర అవమానం..