Site icon NTV Telugu

Congress: నీట్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు.. మోడీ మౌనం వీడాలన్న ఖర్గే

Kharge

Kharge

నీట్‌ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. నీట్‌- యూజీ 2024 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఫోరెన్సిక్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతుందని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీల ద్వారా నీట్‌ కుంభకోణాన్ని కప్పిపుచ్చడం ప్రారంభించిందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

ఇది కూడా చదవండి: AP CM and Deputy CM: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నీట్‌ పేపర్‌ లీక్‌ కానప్పుడు.. బీహార్‌లో పేపర్‌ లీక్‌ పేరిట 13 మందిని ఎందుకు అరెస్టు చేశారు? అని ఖర్గే నిలదీశారు. గుజరాత్‌లోని గోధ్రాలో చీటింగ్ రాకెట్‌ గుట్టురట్టు కాలేదా?, మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. దాదాపు 24 లక్షల మంది యువత ఆకాంక్షలను తుంగలో తొక్కారని.. మార్కులు, ర్యాంకులను భారీగా రిగ్గింగ్ చేసిందన్నారు. మెరిట్‌ విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పొందకుండా చేసేందుకే కేంద్రం ఈ ఆటలాడినట్లు కనిపిస్తోందని ఖర్గే ఆరోపించారు. నీట్‌ వ్యవహారం.. ‘వ్యాపమ్‌ 2.0’ అని పార్టీ మీడియా ఇన్‌ఛార్జి పవన్‌ ఖేడా విమర్శలు చేశారు.

ఇది కూడా చదవండి: Prajavani: ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుల వెల్లువ

Exit mobile version