NTV Telugu Site icon

Neeraj Chopra: చరిత్ర సృష్టించిన భారత్.. పసిడి పతకం సాధించిన నీరజ్ చోప్రా

Neeraj

Neeraj

ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న భారత్ కల నెరవేరింది. ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సాధించాడు.  అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌లో భారత్ జెండా రెపరెపలాడింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా స‌త్తాచాటాడు.హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశాడు. స్వ‌ర్ణ ప‌తకం గెలిచాడు. గోల్డ్ మెడ‌ల్ సాధించిన‌ తొలి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా రికార్డ్ నెల‌కొల్పాడు. జావెలిన్ త్రో ఫైన‌ల్‌లో జావెలిన్‌ను 88.17 మీట‌ర్లు విసిరాడు నీరజ్. ఫైనల్స్ తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో మారు జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరాడు. ఆ తరువాత వరుసగా 86.32, 84.64, 87.73, 83.98, మీటర్ల దూరానికి విసిరాడు.

Also Read:      Allu Arjun: ఒక స్మగ్లర్ కు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు.. బన్నీ ఏమన్నాడంటే..?

ఇక పాకిస్తాన్ కు చెందిన అర్ష‌ద్ న‌దీమ్ జావెలిన్ ను 87.82 మీటర్లు విసిరాడు. ఇక చెక్ రిపబ్లిక్ కు చెందిన జాకబ్ వడ్ లెజ్క్ మూడో స్థానంలో నిలిచి  కాంస్య పథకాన్ని దక్కించుకున్నారు. జాకబ్ వడ్ లెజ్క్ ఈటెను  86.67 మీట‌ర్లు విసిరి బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఇక నీరజ్ చోప్రాతో పాటు ఇండియా నుంచి మరో ఇద్దరు ప్లేయర్ లు కూడా ఈ పథకం కోసం పోటీ పడ్డారు. వారిలో ఒకరైన కిషోర్ జెనా 84.77 మీటర్లతో ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు. ఇక మరో ప్రత్యర్థి డీపీ మను 84.14 మీటర్ల దూరం విసిరి ఆరో స్థానంలో నిలిచాడు.  షూట‌ర్ అభిన‌వ్ బింద్రా త‌ర్వాత ఒలింపిక్స్‌తో పాటు వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్ టైటిల్ గెలిచిన ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు నీరజ్ చోప్రా. ఇక 2016లో ప్రపంచ అండర్‌–20 చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి వెలుగులోకి వచ్చిన నీరజ్‌ చోప్రా ఈ ఏడేళ్ల కాలంలో దేశం గర్వించేలా ఎన్నో పథకాలు సాధించాడు. 2017 ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొని 15వ స్థానంలో నిలిచాడు నీరజ్. ఇక అదే ఏడాది  భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన నీరజ్‌ తరువాత కూడా భారత్ కు స్వర్ణాలు అందించాడు.  2018 ఆసియా క్రీడల్లో, 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్స్ లో కూడా జావెలిన్ త్రో లో బంగారు పతకాన్ని కైవసం చేసుకొని దేశానికి వన్నె తెచ్చాడు.