NTV Telugu Site icon

NDSA Committee: మేడిగడ్డకు కేంద్ర కమిటీ.. నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన

Ndsa Committee

Ndsa Committee

NDSA Committee: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆరుగురు నిపుణుల కమిటీ నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనుంది. ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం లీకేజీతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల డిజైన్ల పరిశీలన, నిర్మాణాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ- ఎన్‌డీఎస్ఏ ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర వాటర్‌ కమిషన్‌కు చెందిన చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఛైర్మన్‌గా, యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్‌, శివకుమార్‌ శర్మ, రాహుల్‌ కుమార్‌ సింగ్‌, అమితాబ్‌ మీనాలు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ బుధవారం హైదరాబాద్‌ చేరుకుంది. రెండ్రోజుల పాటు డ్యాంలను సందర్శించి డిజెన్లు, నిర్మాణాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది.

కాళేశ్వరం ప్రాజెక్టులోని సందర్శనలో భాగంగా నిపుణుల కమిటీ ఈ రోజు మేడిగడ్డ ఆనకట్టను సందర్శించనుంది. మేడిగడ్డకు బయలుదేరనున్న కమిటీ మధ్యాహ్నం 1:30 గంటల వరకూ బ్యారేజీని పరిశీలించనుంది. ప్రధానంగా కుంగుబాటుకు దారితీసిన కారణాలను బృందం అధ్యయనం చేయనుంది. బ్యారేజీ పగుళ్లు కారణంగా ఆనకట్ట సామర్థ్యం గేట్ల పరిస్ధితి సమగ్రంగా విశ్లేషించి ఎలాంటి మరమ్మతులు అవసరమో సిఫార్సులు చేయనుంది. మధ్యాహ్నం అన్నారం బ్యారేజీని సందర్శించనుంది. ఆనకట్టలో సీపేజీకి దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించనుంది. వర్షాకాలంలో గోదావరికి వరద ప్రారంభమైయ్యే పరిస్ధితులనూ పరిగణనలోకి తీసుకుని బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను నిపుణుల కమిటీ నివేదిక రూపంలో రాష్ట్ర సర్కారుకు అందజేయనుంది. శుక్రవారం సుందిళ్ల బ్యారేజీని సందర్శించనున్న నిపుణుల కమిటీ, రాత్రికి హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఈ నెల 9న హైదరాబాద్‌లో సాగునీటి శాఖ అధికారులతో భేటీ అనంతరం అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లనున్నారు.

Read Also: Temperature Increase: ఏపీ, తెలంగాణపై భానుడి ప్రతాపం.. అమాంతం పెరిగిన ఉష్ణోగ్రతలు

ఈ కమిటీకి అవసరమైన సహకారం అందించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తెస్తామని నిపుణుల బృందం చెప్పినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. సమస్యకు కారణం ఎవరనేది కూడా నివేదికలో పొందుపరచాలని కూడా కోరినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కోరగానే కేంద్ర జలశక్తి శాఖ నిపుణుల కమిటీ వేసి, మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు పంపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.