NTV Telugu Site icon

IPL 2025: ఊసరవెల్లి అంటూ.. లైవ్ టీవీలో సిద్ధూ, రాయుడు గొడవ!

Navjot Singh Sidhu, Ambati Rayudu

Navjot Singh Sidhu, Ambati Rayudu

టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కాంట్రవర్సీ వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్ 2024 సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్, ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పదే పదే విమర్శలు చేసి.. ఏకంగా హత్యా బెదిరింపులకు గురయ్యాడు. ఐపీఎల్ 2025లో హార్దిక్ పాండ్యా విషయంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్‌కు కౌంటర్ ఇచ్చాడు. ఇది జరిగి ఓ రోజు కూడా గడవకముందే లైవ్ టీవీలో మరో మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధుతో గొడవ పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌లుగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అంబటి రాయుడు వ్యవహరించారు. కామెంటరీలో భాగంగా రాయుడు సరదాగా మాట్లాడుతూ.. ‘సిద్ధూ టీమ్‌లను ఎప్పటికప్పుడు ఊసరవెల్లిలాగా మార్చుతుంటాడు’ అని అన్నాడు. అందుకు పగలపడి నవ్విన సిద్ధూ.. అంతే సరదాగా రాయుడుకు కౌంటర్ వేశాడు. ‘ఈ ప్రపంచంలో ఊసరవెల్లికి ప్రతిరూపం ఎవరైనా ఉన్నారంటే.. అది నువ్వే’ అని రిప్లై ఇచ్చాడు. దాంతో ఇద్దరూ నవ్వుకున్నారు. ఈ వీడియో నెట్టింట హల్చల్ అవుతోంది. నిత్యం కాంట్రవర్సీలో తలదూర్చే రాయుడుని నెటిజెన్స్ ఏసుకుంటున్నారు.

Also Read: Rohit Sharma: ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శ‌ర్మకు అరుదైన గౌర‌వం!

అంబటి రాయుడు భారత్ తరఫున 55 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 1736 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు రాయుడు 204 ఐపీఎల్ మ్యాచ్‌లలో 4348 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడాడు.