రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ (Alexei Navalny) అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయి. కట్టుదిట్టమైన పోలీసుల భద్రత మధ్య.. వేలాది మంది ప్రజలు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు శవపేటికను మాస్కోలోని చర్చికి తరలించి.. అనంతరం బోరిసోవ్‌స్కోయ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు నావల్నీకి మద్దతు నినాదాలు చేశారు. నావల్నీ మీరు భయపడలేదు.. మేము భయపడం.. యుద్ధం వద్దు అంటూ నినాదాలు చేశారు.
నావల్నీ తల్లిదండ్రులు, అమెరికా రాయబారి లిన్ ట్రేసీ సహా పశ్చిమ దేశాల దౌత్యవేత్తలు, అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయాలని ఆశించిన బోరిస్ నదేజ్దిన్, యెకథెరినా దంత్సోవా తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక విదేశాలకు వెళ్లిపోయిన ఆయన రాజకీయ సన్నిహితులు యూట్యూబ్ ఛానెల్‌లో అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించినట్లు సమాచారం.
గత నెల ఫిబ్రవరి 16న ఆర్కిటిక్ పీనల్ కాలనీలో అలెక్సీ మరణించారు. మృతదేహాన్ని తీసుకోవడానికి తల్లి లియుడ్మిలా పట్టువీడకుండా ప్రయత్నాలు చేశారు. శుక్రవారం కూడా మృతదేహాన్ని అప్పగించేందుకు ఆలస్యం చేశారని ఆయన సన్నిహితుడు ఆరోపించారు. మృతదేహాన్ని తరలించేందుకు వాహన డ్రైవర్లు ఎవరూ ముందుకు రాలేదనే వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. నావల్నీ మరణానికి గల కారణాన్ని మాత్రం అధికారులు ఇప్పటివరక ప్రకటించకపోవడం విశేషం. ఇక ప్రపంచ దేశాలన్ని నావల్నీ మృతిపై విచారం వ్యక్తం చేశాయి.
Dee
