NTV Telugu Site icon

National Games 2023: నేటి నుంచి గోవాలో జాతీయ క్రీడలు.. 43 క్రీడా విభాగాల్లో 10 వేల మంది పోటీ!

National Games 2023

National Games 2023

PM Modi to inaugurate National Games 2023 in Goa Today: ఇండియన్ ఒలింపిక్స్‌గా పిలిచే ‘నేషనల్ గేమ్స్‌’ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. జాతీయ క్రీడలకు (నేషనల్ గేమ్స్‌) తొలిసారిగా గోవా ఆతిథ్యం ఇస్తోంది. 37వ ఎడిషన్‌ జాతీయ క్రీడలు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు జరగనున్నాయి. నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నేషనల్ గేమ్స్‌ ఆరంభం కానున్నాయి. దేశంలోని అత్యుత్తమ క్రీడాకారులను, అథ్లెట్లను వెలుగులోకి తెచ్చే ప్రయత్నమే ‘నేషనల్ గేమ్స్’ అన్న విషయం తెలిసిందే.

గోవాలోని ఐదు ప్రధాన నగరాల్లో రెండేసి ప్రదేశాల చొప్పున మొత్తంగా 10 ప్రాంతాల్లో 2023 జాతీయ క్రీడలు జరుగనున్నాయి. మపుసా, మార్గావ్‌, పంజిమ్‌, పోండా, వాస్కో నగరాలు ఈ క్రీడల కోసం క్రీడా గ్రామాలుగా మారిపోయాయి. 37వ ఎడిషన్‌ జాతీయ క్రీడల్లో 10 వేల మంది ఆటగాళ్లు 43 క్రీడా విభాగాల్లో పోటీ పడనున్నారు. సుమారు 2.5 లక్షల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ ప్రధానితో పాటు నేషనల్ గేమ్స్‌ ఆరంభ వేడుకల్లో పాల్గొంటారని తెలుస్తోంది.

Also Read: US Gun Firing: అమెరికాలో దుండగుల కాల్పులు.. 22 మంది మృతి!

నిజానికి గోవాలో 2016లో జాతీయ క్రీడలు జరగాల్సింది. 36వ ఎడిషన్ నేషనల్ గేమ్స్ హక్కులను గోవా సొంతం చేసుకున్నా.. పలుమార్లు వాయిదా పడడంతో కుదరలేదు. చివరకు 37వ నేషనల్ గేమ్స్‌కి గోవా ఆతిథ్యం ఇస్తోంది. గతేడాది గుజరాత్‌లో జాతీయ క్రీడలు (36వ ఎడిషన్) జరిగాయి. 35వ ఎడిషన్ నేషనల్ గేమ్స్ 2015లో కేరళలో జరిగాయి. 1924లో తొలిసారిగా లాహోర్‌లో నేషనల్ గేమ్స్ జరిగాయి. ప్రస్తుతం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ క్రీడలను నిర్వహిస్తోంది.