Site icon NTV Telugu

కేసీఆర్ మాటలు జగన్‌కు అవమానంగా అనిపించలేదా?: లోకేష్

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్లీనరీలో ఏపీలో పార్టీ పెట్టాలనుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను లోకేష్ ప్రస్తావించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఎద్దేవా చేయ‌డం సీఎంగా మీకు అవ‌మానం అనిపిస్తుందో లేదో కానీ, ఐదుకోట్ల ఆంధ్రుల‌కు మాత్రం ఆ వ్యాఖ్యలు తీర‌ని అవ‌మాకరంగా భావిస్తున్నారని లోకేష్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీ సర్కారు ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులపై కన్నేసిందని, ప్రభుత్వం నియమించిన రత్నకుమారి కమిటీ ఎవ్వరితోనూ సంప్రదింపులు జరపకుండానే నివేదిక ఇచ్చిందని లోకేష్ ఆరోపించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులతో కమిటీ చర్చలు జ‌ర‌పలేదన్నారు. ప్ర‌భుత్వం కోరిన నివేదిక ఇచ్చింద‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై జ్యుడీషియ‌ల్ ఎంక్వైరీ జ‌ర‌పాలని డిమాండ్ చేశారు.

Read Also: టీటీడీ డైరీ, క్యాలెండర్ల పేరిట కేటుగాళ్ళ దందా

ఏపీలో ఎయిడెడ్ సంస్థ‌ల్ని య‌థావిధిగా కొన‌సాగించాలని… ఏ ఒక్క స్కూలు మూత‌ప‌డకుండా చూడాలని లేఖలో లోకేష్ కోరారు. ప్ర‌భుత్వం తీసుకున్న‌ అనాలోచిత‌, మూర్ఖ‌పు నిర్ణ‌యాల‌తో ఎయిడెడ్ స్కూళ్లు డెడ్ అవుతున్నాయని వాపోయారు. ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం.. లక్షలాది విద్యార్థుల భ‌విష్య‌త్తుకి మ‌ర‌ణ‌శాస‌నంగా మారిందన్నారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేయాల‌నేది పాల‌కుడి ల‌క్ష్య‌మైతే… ఒకే ఒక్క విద్యా వ్య‌వ‌స్థ‌ను ధ్వంసం చేస్తే చాలని త‌త్వ‌వేత్త మాకియ‌వెల్లి అన్నారని గుర్తుచేశారు. విద్యా వ్య‌వ‌స్థ‌పై ఏపీ ప్రభుత్వం చేస్తోన్న దాడి చూస్తుంటే, అన్ని వ్య‌వ‌స్థ‌ల ధ్వంసానికి తెగ‌బ‌డుతున్న‌ట్టే అనిపిస్తోందన్నారు. అమ్మ ఒడి ఇవ్వ‌డానికి ..కొడుకు బ‌డిని బ‌లిపీఠంపై ఎక్కించ‌డం భావ్య‌మేనా అని ప్రశ్నించారు.

Read Also: ఏపీలో ఈరోజు తగ్గిన కరోనా కేసులు

మొన్న వైజాగ్, నిన్న కాకినాడ, నేడు గుంటూరు, రేపు మరో ప్రాంతం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠ‌శాల‌ల మూసివేత‌కు వ్యతిరేకంగా విద్యార్ధులు, తల్లిదండ్రులు రోడ్లెక్కి నిర‌స‌న తెలియ‌జేస్తున్నారని.. ఇంత జరుగుతోన్నా మీ మూర్ఖ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకుంటున్నారంటే ఏమ‌నుకోవాలి? అంటూ లోకేష్ తన లేఖలో జగన్‌ను నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,203 ఎయిడెడ్ పాఠశాలల్లో 1,96,313 మంది విద్యార్ధులు, 182 జూనియర్ కాలేజీల్లో 71,035 మంది విద్యార్ధులు, 116 డిగ్రీ కాలేజీల్లో 2.50 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్ ప్రశార్ధకం కానుందన్నారు. ఎన్నోఏళ్ల నుంచి లక్షలాది పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలను ఆ నిరుపేద‌ల‌కు దూరం చేయ‌డాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోందని లోకేష్ స్పష్టం చేశారు.

Exit mobile version