Site icon NTV Telugu

Nara Lokesh: దూసుకొస్తున్న ‘మొంథా’ తుఫాన్.. నిరంతర పర్యవేక్షణ, హై-లెవల్ సన్నాహాలు జరుగుతున్నాయి..!

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: గత ఐదు రోజులుగా రాష్ట్రంపై ప్రభావం చూపుతున్న భారీ తుఫాన్ ఈ రాత్రి సుమారు 11 గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావం దాదాపు 40 లక్షల మందిపై ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రాణ నష్టం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోందని మంత్రి లోకేష్ తెలిపారు.

ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచే తుఫాన్‌పై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నుంచి వెళ్తున్న రియల్ టైం రిపోర్టులు ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) కూడా చేరుతున్నాయని మంత్రి లోకేష్ వెల్లడించారు. మొత్తం 1328 గ్రామాల్లో ముంపు ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ విపత్తు కారణంగా NDRF, SDRF బృందాలు ఇప్పటికే సన్నద్ధంగా ఉన్నాయని.. అవసరమైతే రంగంలోకి దిగేందుకు హైదరాబాద్‌లో ఆర్మీ బృందాలు కూడా అలెర్ట్‌గా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక ఈ నెల 29 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

BSNL: బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగాలు.. నెలకు రూ. 50000 శాలరీ..

ఇక తుఫాన్ సమయంలో అత్యంత కీలకమైన విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అత్యవసర పరిస్థితుల కోసం 13 వేలకు పైగా విద్యుత్ పోల్స్, అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌లు అందుబాటులో ఉంచబడ్డాయి. ముఖ్యంగా ఆసుపత్రులకు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 78 శాతం సెల్ టవర్లకు కావాల్సిన డీజిల్ సహా ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి, కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోకుండా చూసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

ఆర్టీజీఎస్ (RTGS) వ్యవస్థ నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ తీరం దాటిన వెంటనే.. రియల్ టైం ట్రాకింగ్ ఆధారంగా తక్షణ సహాయక, పునరావాస చర్యలపై దృష్టి సారిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం తుఫాన్ తీరం దాటే సమయంలో గాలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించిన మంత్రి లోకేష్.. ప్రజలు దయచేసి అందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వ అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Khaidi : చిరంజీవి ఖైదీకి 42 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న హీరో అతనే

ముఖ్యంగా 1500 గ్రామాల్లో హై రిస్క్ ఉన్నందున, ప్రజాప్రతినిధులు అందరూ నిరంతరం ప్రజలతో టచ్‌లో ఉండాలని ఆదేశించారు. తుఫాన్ తీరం దాటిన వెంటనే నష్టం అంచనా వేసి సహాయక చర్యలు ప్రారంభించడానికి వీలుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఫీల్డ్‌కు వెళ్లాలని లోకేష్ సూచించారు. ఎక్కువ ప్రభావం చూపిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన కరెంట్ పునరుద్ధరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే వారిపై తగిన చర్యలు తీసుకునే అంశాన్ని హోం మంత్రి పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మంత్రులు అందరూ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని లోకేష్ తెలిపారు.

Exit mobile version