టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ రోజుకు రోజుకు పెరుగుతోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కడప జిల్లా బహిరంగ సభలో లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కూడా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే డిమాండ్‌ను వినిపించారు. ప్రస్తుతం సోమిరెడ్డి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలన్న పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను. డిప్యూటీ సీఎం పదవికి నారా లోకేష్ వంద శాతం అర్హులే. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. లోకేష్ బాబు పోరాటపటిమను చూసి టీడీపీ కేడర్‌తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొట్టింది. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాల అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నాను’ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్న విషయం తెలిసిందే. ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్రబాబు తరువాత నంబర్ టూగా పవన్ ఉన్నారు. సింగిల్ డిప్యూటీ సీఎంగా పవన్ సక్సెస్ అయ్యారు. దీంతో టీడీపీలో ఒక వర్గం నారా లోకేష్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ రోజుకు రోజుకు పెరుగుతోంది. లోకేష్ డిప్యూటీ సీఎం విషయంలో జనసేన నుంచి ఏదైనా స్పందన వస్తుందా?, సీఎం చంద్రబాబు వీటిని ఖండిస్తారా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.