కట్టుకున్న భర్తే.. ఆమె పాలిట కాల యముడయ్యాడు. నిత్యం అనుమానిస్తుండడంతో దూరంగా ఉంటున్న ఆమెను నమ్మించి అత్యంత దారుణంగా కడతేర్చాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. భార్య కాపురానికి రాలేదన్న కారణంతో భర్త.. ఆమెను ఇటుకలతో కొట్టి చంపేశాడు. ఇక్కడ చూడండి.. విగత జీవిగా పడి ఉన్న ఈమె పేరు లక్ష్మీ పార్వతి. ఆమె స్వస్థలం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కృష్ణాపురం. ఈమెకు చింతకుంటకు చెందిన నల్లగట్ల శేషగిరితో వివాహమైంది. వారిద్దరికీ నలుగురు సంతానం ఉన్నారు.
కొన్నాళ్లపాటు లక్ష్మీపార్వతి, శేషగరి సంసారం బాగానే సాగింది. కానీ శేషగిరికి భార్యపై అనుమానం మొదలైంది. ఆ అనుమానం వారి సంసారంలో చిచ్చు పెట్టింది. మరోవైపు శేషగిరి మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో నిత్యం లక్ష్మీ పార్వతిని వేధించడం కూడా పరిపాటిగా మారింది. భర్త వేధింపులు తట్టుకోలేక.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి రావాలని శేషగిరి చాలాసార్లు కోరాడు. కానీ ఆమె ససేమిరా అని చెప్పింది. ఇక చేసేదేం లేక.. భార్య పుట్టింటికి వెళ్లాడు. ఇక నుంచి అనుమానించనని.. వేధించనని ఆమెకు చెప్పాడు. ఇంటికి రావాలని బతిమిలాడుకున్నాడు. ఐతే భర్త మాటలను పూర్తిగా నమ్మని లక్ష్మీ పార్వతి.. సర్లే చూద్దామని చెప్పింది. రాత్రి అయిన తర్వాత భార్యపై మరింత ఆగ్రహం పెంచుకున్న శేషగిరి.. ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు.
Also Read: Pidamarthi Ravi: ఇక భౌతిక దాడులే.. మార్వాడీలకు హెచ్చరికలు జారీ చేసిన పిడమర్తి రవి!
రాత్రి అందరూ పడుకున్న తర్వాత.. భార్య తలపై ఇటుకలతో బాదాడు. అంతే కాకుండా ఇంటి మిద్దెపై నుంచి కిందకు తోసేశాడు. దాంతో లక్ష్మీ పార్వతి అక్కడికక్కడే మృతి చెందింది. భార్య చనిపోయిన తర్వాత శేషగిరి.. అక్కడి నుంచి పరారయ్యాడు. లక్ష్మీ పార్వతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శేషగిరి కోసం గాలిస్తున్నారు. భార్యను అతి దారుణంగా హత్య చేసిన శేషగిరిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
