Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..

Accident

Accident

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తులూరు వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమల ట్రావెల్స్, మహేశ్వరి ట్రావెల్స్ బస్సులు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. అయితే.. బస్సుల్లో ఉన్న ప్రయాణికులందరూ తృటిలో ఘోర ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అధికారులు, ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదం
లభ్యమైన సమాచారం ప్రకారం.. అమల ట్రావెల్స్ బస్సు 20 మంది ప్రయాణికులతో పొద్దుటూరు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తోంది. అదే సమయంలో, 27 మంది ప్రయాణికులతో బద్వేల్ నుంచి హైదరాబాద్‌ మార్గంలో పయనిస్తున్న మహేశ్వరి ట్రావెల్స్ బస్సును అమలా ట్రావెల్స్ బస్సు ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వేగ నియంత్రణ కోల్పోయి అమల ట్రావెల్స్ బస్సు మహేశ్వరి ట్రావెల్స్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ధ్వంసమైన వాహనాలు
ఢీకొన్న తీవ్రతకు అమల ట్రావెల్స్ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ముందు భాగంలో కూర్చున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక ముందు వెళ్తున్న మహేశ్వరి ట్రావెల్స్ బస్సు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉండటంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు వేశారు. ఏ ఒక్కరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

పోలీసుల దర్యాప్తు
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆళ్లగడ్డ స్థానిక పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా రహదారిపై నిలిచిపోయిన బస్సులను పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమా లేదా డ్రైవర్ నిద్రమత్తా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.