Gunshots Fired: నందలూరులో నామినేషన్ల రగడ.. గాల్లోకి కాల్పులు, కార్లకు నిప్పు!

Gunshots Fired

Gunshots Fired

Gunshots Fired: వైఎస్సార్ కడప జిల్లా నందలూరులో జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నామినేషన్ విషయంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణగా మారింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలు, కుర్చీలు విసురుకోవడంతో నందలూరు ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది. నందలూరుకు చెందిన ఎద్దుల విజయసాగర్‌కు మద్దతుగా టీడీపీ రాజంపేట ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, ఎలైట్ ఆస్పత్రి అధినేత డాక్టర్ బాలసుబ్రమణ్యం వర్గం నిలిచింది. మరోవైపు మేడా విజయశేఖర్‌రెడ్డి వర్గం నుంచి అభ్యర్థి టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు రావడంతో వివాదం మొదలైనట్లు సమాచారం. ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం క్రమంగా పరస్పర దాడులకు దారితీసింది.

ఘర్షణ తీవ్రరూపం దాల్చి పరిస్థితి అదుపుతప్పుతున్న సమయంలో టీడీపీ నేత డాక్టర్ బాలసుబ్రమణ్యం తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీతో గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో అక్కడున్న వారిలో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ ఘటనలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ మనోజ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో మేడా విజయశేఖర్‌రెడ్డిపై ప్రత్యర్థి వర్గం దాడికి పాల్పడినట్లు సమాచారం. ఆందోళనకారులు రెండు కార్లకు నిప్పుపెట్టడంతో అవి దగ్ధమయ్యాయి. అలాగే పలు ద్విచక్రవాహనాలు కూడా ధ్వంసమైనట్లు సమాచారం. ఇరువర్గాలు రాళ్లు, కర్రలు, కుర్చీలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు నాయకులు, కార్యకర్తలతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.

ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అదనపు పోలీసు బలగాలను నందలూరుకు తరలించారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో నందలూరులో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నామినేషన్ల సందర్భంగా ఒకే పార్టీలోని రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కాల్పులు, వాహనాల దహనం వరకు వెళ్లడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.