Naman Dhir: టీ20 క్రికెట్‌లో బౌలర్‌పై సిక్స్ కొట్టడం అంటే బ్యాటర్ ఆధిపత్యానికి సంకేతం.. కానీ, టీమిండియా సంచలనం నమన్ ధీర్ బౌలింగ్‌లో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. అతడి బౌలింగ్ లో సిక్స్ కొట్టిన బ్యాటర్లను మరుసటి బంతికే పెవిలియన్‌కు పంపుతున్నాడు. అవును మీరు చదివింది నిజమే.. కావాలంటే ఒకసారి అతడి వికెట్లను పరిశీలంచండి..
టీమిండియా ఆల్‌రౌండర్ నమన్ ధీర్ తన తొలి టీ20 అంతర్జాతీయ సిరీస్‌లోనే ప్రత్యేకమైన బౌలింగ్ ప్యాటర్న్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తనపై సిక్స్ కొట్టిన బ్యాటర్‌ను.. ఆ వెంటనే వచ్చే బంతికే పెవిలియన్‌కు పంపుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు టీ20ల్లో నమన్ ధీర్ తీసిన ఐదు వికెట్లకూ ఇదే ప్యాటర్న్ ఉంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనే నమన్ ధీర్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. లక్నోలో జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు తీసిన అతడు.. రాంచీలో జరిగిన రెండో మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోయాడు. ఇక నిన్న ఇండోర్‌లో జరిగిన మూడో టీ20లో మరో రెండు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. దీంతో మూడు టీ20ల్లోనే అతడి ఖాతాలో 5 వికెట్లు చేరాయి.
అయితే ఈ ఐదు వికెట్లలోనూ ఒక ఆసక్తికరమైన పోలిక కనిపిస్తోంది. నమన్ ధీర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన బ్యాటర్లనే.. ఆ తర్వాతి బంతికే అతడు ఔట్ చేశాడు. వెస్టిండీస్‌తో లక్నోలో జరిగిన తొలి టీ20లో షై హోప్ 12వ ఓవర్ మూడో బంతికి నమన్ ధీర్‌పై సిక్స్ కొట్టాడు. అయితే వెంటనే నాలుగో బంతికే హోప్‌ను నమన్ ధీర్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత 14వ ఓవర్ తొలి బంతికి రొమారియో షెఫర్డ్ సిక్స్ బాదాడు. వెంటనే రెండో బంతికే అతడిని కూడా నమన్ ధీర్ ఔట్ చేశాడు. ఇక 16వ ఓవర్ నాలుగో బంతికి షమార్ స్ప్రింగర్ సిక్స్ కొట్టగా.. ఐదో బంతికే నమన్ ధీర్ అతడిని బోల్తా కొట్టించాడు.
అలాగే మూడో టీ20లోనూ నమన్ ధీర్ తన ప్యాటర్న్‌ను కొనసాగించాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ఐదో బంతికి షిమ్రాన్ హెట్‌మయర్ సిక్స్ బాదాడు. అయితే తర్వాతి బంతికే నమన్ ధీర్ అతడిని ఔట్ చేశాడు. అదే విధంగా 11వ ఓవర్ ఐదో బంతికి పూరన్ సిక్స్ కొట్టాడు. వెంటనే తర్వాతి బంతికే నమన్ ధీర్ పూరన్ వికెట్ తీసుకున్నాడు. మూడు టీ20ల్లోనే ఐదు వికెట్లు తీసిన నమన్ ధీర్.. ఇదే ప్యాటర్న్‌ను కొనసాగిస్తే ఇకపై అతడి బౌలింగ్‌లో సిక్స్ కొట్టే ముందు బ్యాటర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే..

