Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం అందరూ ముందుకు రావాలి.. హీరో నాగార్జున పిలుపు

Narajuna

Narajuna

Nagarjuna: దేశం నుంచి డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంకల్పం విజయవంతం కావాలని ప్రముఖ సినీనటుడు, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆకాంక్షించారు. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన నషా ముక్త్ భారత్ కార్యక్రమం అభినందనీయమని, యాత్రకు వస్తున్న యువత మద్దతు ప్రశంసనీయమని అన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

దేశం నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా తొలగించాలనే గొప్ప సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి స్ఫూర్తినిచ్చారని నాగార్జున తెలిపారు. ఈ లక్ష్య సాధనలో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో భాగస్వాములై ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇది వారి భవిష్యత్తుతో పాటు రాబోయే తరాల భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమమని స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా ఈ యాత్రను గమనిస్తున్నానని, పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత ఇందులో భాగస్వాములవడం ఆనందంగా ఉందని చెప్పారు. డ్రగ్స్ రహిత భారతదేశం కోసం కిషన్ రెడ్డి చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాలని, ఈ సంకల్పానికి అందరూ తమ మద్దతు అందించాలని నాగార్జున పిలుపునిచ్చారు.