Mysterious Sounds: మహారాష్ట్రలోని లాతూర్ నగరంలోని తూర్పు భాగంలో మిస్టరీ ధ్వనులు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బుధవారం భూమి లోపల నుంచి శబ్దాలు వస్తుండడంతో స్థానికులు వణికిపోయారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఈ మిస్టరీ శబ్దాలకు కారణాలను తెలుసుకునేందుకు నిపుణులను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. బుధవారం ఉదయం 10.30 నుంచి 10.45 గంటల మధ్య వివేకానంద చౌక్ సమీపంలో ఈ శబ్దాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నివాసితులలో భయాందోళనలు, భూకంపం పుకార్లు వ్యాపించాయి.లాతూర్ నగరంలోని భూకంప కొలత కేంద్రాలతో పాటు జిల్లాలోని ఔరద్ షాహజ్ని, ఆశివ్ నుంచి జిల్లా విపత్తు నిర్వహణ శాఖ సమాచారం తీసుకున్న తర్వాత కొంతమంది స్థానిక పరిపాలనను అప్రమత్తం చేశారు, అయితే ఎలాంటి భూకంప కార్యకలాపాల గురించి నివేదిక లేదని ఓ అధికారి తెలిపారు. .
విపత్తు నిర్వహణ అధికారి సాకేబ్ ఉస్మానీ బుధవారం మాట్లాడుతూ.. మరఠ్వాడా ప్రాంతంలో ఎప్పటికప్పుడు కొన్ని శబ్దాలు నివేదించబడ్డాయన్నారు. సెప్టెంబరు 2022లో, లాతూర్ జిల్లాలోని హసోరి, కిల్లారి, పరిసర ప్రాంతాల్లో మూడుసార్లు అలాంటి శబ్దాలు వినిపించాయని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన జిల్లాలోని నీలంగా తహసీల్‌లోని నీటూరు-దంగేవాడి ప్రాంతంలో ఇలాంటి శబ్దాలు వినిపించాయని అధికారి తెలిపారు. సెప్టెంబరు 2022లో లాతూర్ జిల్లాలోని హసోరి గ్రామంలో భూగర్భం నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అప్పట్లో గ్రామస్థులు తొలుత ఆశ్చర్యానికి గురైనప్పటికీ గడిచిన వారానికి పైగా అవి కొనసాగుతుండడంతో వారిలో భయం మొదలయ్యింది. ఈ నేపథ్యంలో వింత శబ్దాలపై శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజమ్ నిపుణులకు సమాచారం అందించారు.
Read Also: Machu Picchu: ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్ ‘మచు పిచ్చు’ రీఓపెన్.. సందర్శనకు అనుమతి
ఈ గ్రామానికి 28 కి.మీ దూరంలోనే కిల్లారి అనే ఊరుంది. 1993లో అక్కడ సంభవించిన భారీ భూకంపంలో 9700 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి విషాదాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే, ప్రస్తుతానికి అక్కడ భూకంప సూచికలు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు.