Site icon NTV Telugu

Aung San Suu Kyi: ఆంగ్‌ సాన్‌ సూకీకి మరో ఏడేళ్లు జైలుశిక్ష!

Aung San Suu Kyi

Aung San Suu Kyi

Aung San Suu Kyi: ఇండియాతో సరిహద్దు పంచుకునే మయన్మార్ దేశంలో మరో సంచలనం చోటుచేసుకుంది. కొన్నేళ్లుగా అంతర్గత కలహాలతో అట్టుడుకుతూ, ప్రస్తుతం సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో మాజీ నాయకురాలు, హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీ జైలులో మగ్గుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆమె అవినీతికి పాల్పడిందనే కేసులో మయన్మార్ కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది. మయన్మార్‌లో నేతగా పదవీచ్యుతురాలైన ఆంగ్‌సాన్ సూకీకి సంబంధించిన ఐదు అవినీతి కేసుల్లో అంతా కలిపి ఏడేళ్ల జైలుశిక్షను మిలిటరీ కోర్టు శుక్రవారం విధించింది. పాత కేసులను తిరగదోడి ఈ పొడగింపు శిక్షను విధించారని అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి. కోర్టు విచారణ రహస్యంగా జరిగింది. ఆంగ్‌సాన్ సూకీని 2021 ఫిబ్రవరిలో తిరుగుబాటు జరిగినప్పుడు అరెస్టు చేశారు. మయన్మార్ నాయకురాలుగా ఉన్నప్పుడు ఆమె హెలికాప్టర్‌ను లీజుకు తీసుకున్న కేసులో నేరస్తురాలుగా ఈ శిక్ష విధించారని సమాచారం.

నోబెల్ ప్రైజ్ విజేత అయిన ఆంగ్‌సాన్ సూకీ మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా పోరాటం చేశారు. ఆమె తన రాజకీయ జీవితంలో చాలా వరకు జైలులోనే గడిపారు. మయన్మార్‌లోని మిలిటరీ ప్రభుత్వం ఆమెను వివిధ కేసుల్లో జైలు ఉంచింది. జడ్జీ ఆమె మరో ఏడేళ్లు జైలులో గడిపేలా తాజాగా శుక్రవారం శిక్ష విధించారు. ఆమె మీద ఉన్న ఐదు అభియోగాలకు గరిష్ఠంగా 15 ఏళ్లు జైలు శిక్షపడాల్సి ఉంది. సూకీ 2015 నుంచి మయన్మార్‌లో ఐదేళ్ల పాటు ప్రజాస్వామికంగా పాలన చేశారు. అది వరకు ఉన్న 49 ఏళ్ల మిలిటరీ పాలనకు మంగళం పాడారు. ఆమెను అనేక కేసుల్లో ఇరికించారు. కొవిడ్19 ఆంక్షలు ఉల్లంఘించి ప్రచారం చేయడం, అక్రమంగా రేడియో పరికరం కలిగి ఉండడం, రెచ్చగొట్టడం, ప్రభుత్వ రహస్య చట్టాన్ని ఉల్లంఘించడం, దేశ ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడం వంటి వివిధ రకాల నేరాభియోగాలను ఆమెపై సైనిక ప్రభుత్వం మోపింది.

Vande Bharat Express: బాధలోనూ కర్తవ్యాన్ని మరవని ప్రధాని.. వందేభారత్‌ రైలు ప్రారంభం

కోర్టు విచారణలకు హాజరుకాకుండా జర్నలిస్టులను నిషేధించారు. సూకీ తరపు న్యాయవాదులు మీడియాతో మాట్లాడకుండా నిషేధించారు. ఆమె విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ఒక్కసారి మాత్రమే కనిపించింది. దశాబ్దాలుగా ఆమె ఆధిపత్యం చెలాయించిన మయన్మార్ ప్రజాస్వామ్య పోరాటంలో చాలా మంది ఆమె వ్యాప్తి చేసి అహింస అనే ప్రధాన సూత్రాన్ని విడిచిపెట్టారు. “పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్” పేరిట దేశవ్యాప్తంగా సైన్యంతో క్రమం తప్పకుండా ఘర్షణ పడుతున్నారు. తిరుగుబాటు తర్వాత మయన్మార్‌లో పరిస్థితిపై తన మొదటి తీర్మానంలో సూకీని విడుదల చేయాలని గత వారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జుంటాను కోరింది. ఆర్మీ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మయన్మార్ అల్లకల్లోలంగా ఉంది.

Exit mobile version