Jammu Kashmir: భారత్ అంటే భిన్నత్వంలో ఏకత్వం, మత సామరస్యం ప్రదర్శించే దేశంలో గుర్తింపు తెచ్చుకుంది. మన మతాన్ని పాటిస్తూనే ఇతర మతాలను గౌరవించే సంప్రదాయం కేవలం భారతీయులకు మాత్రమే సొంతం. ప్రారంభం నుంచే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇంకా అనేక మతాల వారు సోదర భావంతో జీవిస్తున్నారు. హిందువుల పండుగల్లో ముస్లింలు.. ముస్లిం ప్రార్థనల్లో హిందువులు పాల్గొని ఐక్యతను చాటుతారు. ఈ క్రమంలో తాజాగా మత సామరస్యాన్ని చాటే ఘటన వెలుగు చూసింది. 500 ఏళ్ల పురాతన హిందూ దేవాలయం కోసం తమ భూమిని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ఇద్దరు ముస్లింలు. జమ్మూకశ్మీర్ రియాసి జిల్లాలోని ఖేర్ పంచాయతీకి చెందిన గులాం రసూల్, గులాం మహ్మద్ అనే వ్యక్తులు ఆలయాన్ని కలిపే రోడ్డు నిర్మాణం కోసం తమ భూమిని విరాళంగా ఇచ్చారు.
Read Also: PM Modi: నేడు జార్ఖండ్‌లోని సిమారియాలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..
రియాసి జిల్లా కాన్సి పట్టా గ్రామంలో గౌరీ శంకర్ ఆలయం కోసం సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో 1200 మీటర్ల రహదారిని 10 అడుగుల వెడల్పుతో నిర్మించనున్నారు. పంచాయతీ నిధులతో త్వరలో రోడ్డు నిర్మిస్తామని అధికారులు తెలిపారు. మాజీ పంచాయతీ సభ్యుడు, రైతు గులాం రసూల్ మాట్లాడుతూ రోడ్డు సమస్యను సాకుగా చూపి సమాజంలో చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నించారన్నారు. “ఆలయానికి సరైన రహదారి లేదు. కొందరు వ్యక్తులు చీలికను సృష్టించాలనే ఉద్దేశ్యంతో విద్వేష ప్రచారాన్ని కూడా నడిపారు” అని ఆయన అన్నారు.
మతసామరస్యాన్ని కాపాడేందుకు ఇటీవల పంచాయతీ సభ్యులు, రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూ యజమానులు గులాం రసూల్, గులాం మహ్మద్ తమ భూమిలో కొంత భాగాన్ని రోడ్డు కోసం ఇచ్చేందుకు అంగీకరించారు. మరోవైపు ఆలయం కూడా పునరుద్ధరణకు సిద్ధమైంది. ఈ ప్రాంతంలో ఆలయానికి మరికొంత భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన విషయాన్ని రియాసి జిల్లా డెవలప్‌మెంట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
