NTV Telugu Site icon

IND vs IRE: ముషీర్‌ ఖాన్‌ సెంచరీ.. ఐర్లాండ్‌పై భారత్‌ ఘన విజయం!

India U19

India U19

India U19 won by 201 runs vs Ireland U19: ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ 2024లో యువ టీమిండియా మరో విజయం సాధించింది. బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 201 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో నమన్‌ తివారి (4/53), సౌమి పాండే (3/21) చెలరేగడంతో ఐర్లాండ్‌ 29.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా రెండో విజయం. సెంచరీ చేసిన ముషీర్‌ ఖాన్‌ (118; 106 బంతుల్లో 9×4, 4×6)కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. భారత్‌ నాలుగు పాయింట్లతో గ్రూప్‌-బిలో అగ్రస్థానంలో ఉంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు ఆదర్శ్‌ సింగ్‌ 17, అర్షిన్‌ కులకర్ణి 32 పరుగులు చేశారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ముషీర్‌ ఖాన్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 66 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ముషీర్‌.. సెంచరీ చేయడానికి మరో 34 బంతులే ఆడాడు. ముషీర్‌తో పాటు కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌ (75; 84 బంతుల్లో 5×4) రాణించాడు. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 156 పరుగులు జోడించారు. చివరి 10 ఓవర్లలో భారత్‌ 119 పరుగులు చేసింది. భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది.

Also Read: KTR : ఎన్నికల కోడ్ కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలపై ఉత్తర్వులు జారీ చేయాలి

లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ను భారత బౌలర్లు వణికించారు. ఓపెనర్ జోర్డాన్‌ నీల్‌ (11)ను స్పిన్నర్‌ సౌమీ పాండే పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించగా.. పేసర్‌ నమన్‌ తివారి చుక్కలు చూపించాడు. ఓపెనర్‌ రియాన్‌ హంటర్‌ (13)ను అవుట్‌ చేసిన నమన్‌.. మిడిలార్డర్‌ బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. మరోవైపు సౌమీ పాండే విజృంభించడంతో 29.4 ఓవర్లలోనే ఐర్లాండ్‌ కథ ముగిసింది. దీంతో భారత్‌ 201 రన్స్‌ తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 84 పరుగుల తేడాతో యువ భారత్ చిత్తు చేసిన విషయం తెలిసిందే.