Cyclone Murasu: తీరం దాటిన మురసు తుఫాన్‌.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు!

Cyclone Murasu Rains Ap

Cyclone Murasu Rains Ap

Heavy Rains in AP Due To Cyclone Murasu: తీవ్ర తుఫాన్‌గా మారిన ‘మురసు’ తీరం దాటింది. ఒంగోలు సమీపంలో నెల్లూరు-నరసాపురం మధ్య మురసు తుఫాన్‌ తీరాన్ని దాటింది. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య తుఫాన్‌ తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్‌ తీరం దాటినప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఎప్పటికప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మురసు తుఫాన్‌ పరిస్థితులను రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS), రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. తుఫాన్‌ ప్రభావంతో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ‘మన మిత్ర’ వాట్సాప్ సేవ ద్వారా 9552300009 నంబర్‌కు తెలియజేయాలని అధికారులు సూచించారు. ఈ మేరకు ఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. తుఫాన్‌ ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా సహా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

మురసు తుఫాన్‌ ప్రభావంతో రాజధాని అమరావతి ప్రాంతంలోనూ తెల్లవారుజామున 3 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వాన పడుతోంది. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈదురుగాలుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీనమైన నిర్మాణాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మురసు తుఫాన్‌ ప్రభావం నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నేడు సెలవు వర్తించనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. తుఫాన్‌ ప్రభావంతో విద్యాసంస్థల భవనాలు, విద్యుత్ సరఫరా పరిస్థితిని పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, పరిస్థితిపై నివేదికలు సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పల్నాడు జిల్లా కలెక్టర్ కూడా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.