ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాలను గుర్తుచేసుకుంటూ తిరుపతికి చెందిన సూక్ష్మ కళాకారుడు పల్లి చిరంజీవి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమతో చిత్రాన్ని గీశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పించాలని ఉద్దేశంతో తిరుపతి నుంచి సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండా గ్రామానికి వెళ్లి.. తిరుచానూరు అమ్మవారి కుంకుమతో వేసిన చిత్రపటాన్ని వీరజవాన్ కుటుంబసభ్యులకు అందజేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ మురళీపై అభిమానంతో ఒక చిత్రకారుడుగా తన దేశభక్తిని చాటానని తెలిపారు. పద్మావతి అమ్మవారి కుంకుమతో చిత్రించిన వీరజవాన్ చిత్రపటాన్ని చూసి తిరుపతి జిల్లా కలెక్టర్ కళాకారుడు చిరంజీవిని అభినందించారు.
Also Read: IND vs ENG: భారత్‌తో మ్యాచ్‌లు.. ఇంగ్లండ్ జట్టులోకి ఆడి కొడుకొచ్చేశాడు!
దేశ రక్షణలో జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. మే 8 రాత్రి జమ్ముకశ్మీర్ వద్ద ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. అమర జవాన్‌కు అధికార లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. మురళీ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున చెక్కును కూడా అందించారు. 2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేసిన మురళీ.. ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందారు.
