కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో వేదికపైన ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేసే అంశం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. గత మున్సిపల్ సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవికి కుర్చీ వేయలేదని ఆమె నిలబడి ప్రసంగించారు. ఈ క్రమంలో మున్సిపల్ మేయర్ సురేష్ బాబుపై ఆరోపణల వర్షం కురిపించారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. వాయిదా పడ్డ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాన్ని నేడు నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
నవంబర్ 7వ తేదీన జరిగిన మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొనడంతో మున్సిపల్ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సమావేశాన్ని నేడు (డిసెంబర్ 23) నిర్వహించాలని మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి భారీ బందోబస్తు కావాలంటూ పోలీసులను మున్సిపల్ మేయర్ సురేష్ బాబు కోరారు. గత నెల రోజులుగా మున్సిపల్ సమావేశంలో వేదికపై కుర్చీ కోసం వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జరగబోవు సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఉన్న కారణంగా మున్సిపల్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు.
Also Read: PV Sindhu Wedding: వివాహ బంధంలోకి పీవీ సింధు.. దీవి ప్రత్యేకతలు ఇవే!
నేడు జరగనున్న మున్సిపల్ సమావేశంలోకి కార్పొరేటర్లను మాత్రమే అనుమతించేలా మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిన నేపథ్యంలో మున్సిపల్ సమావేశం రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ వద్ద ఎటువంటి గందరగోళ పరిస్థితులు ఎదురవకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే జిల్లాలో 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉందని వెల్లడించారు.