NTV Telugu Site icon

Crime News: వివాహేతర సంబంధం బయటపడుతుందని.. పక్కింటావిడపై హత్యాయత్నం!

Attempt To Murder

Attempt To Murder

వివాహేతర సంబంధం బయటపడుతుందన్న అనుమానంతో పక్కింట్లో నివాసం ఉంటున్న మహిళపై ప్రియుడు, ప్రియురాలు కలిసి హత్యాయత్నం చేశారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో ఈ ఘటన చోటుచేసుకుంది. గణపర్తికి చెందిన పొలిమేర దీపిక పిల్లలతో కలిసి మునగపాక ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటి పక్కన రాజ్‌కుమార్, సరిత దంపతులు ఉంటున్నారు. అచ్చుతాపురంలో ఓ కంపెనీలో రాజ్‌కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. భర్త రాజ్‌కుమార్ డ్యూటీకి వెళ్లిన తర్వాత తన ప్రియుడిని సరిత ఇంటికి రప్పించుకుంటోంది.

సరిత వ్యవహారాన్ని దీపిక గమనించింది. దీపికకు విషయం తెలిసిందని సరిత పసిగట్టింది. దీపిక ఎక్కడ తన భర్త రాజ్‌కుమార్‌కు చెబుతుందో అని సరిత బయపడింది. ఈ క్రమంలో రాత్రి 10:30 గంటల సమయంలో సరిత, ఆమె ప్రియుడు కలిసి దీపిక ఇంట్లో చొరబడ్డారు. నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి ఇనుపరాడ్డులతో దాడి చేశారు. అదే సమయంలో డ్యూటీ నుండి రాజ్‌కుమార్ ఇంటికి వచ్చాడు. ఇంట్లో సరిత లేకపోవడం, పక్క ఇంట్లో శబ్దాలు రావడంతో దీపిక ఇంట్లోకి రాజ్‌కుమార్‌ వెళ్ళాడు. అప్పటికే దీపిక రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉంది. రాజ్‌కుమార్‌ వెంటనే దీపికను ఆసుపత్రికి తరలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సరిత, ఆమె ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.