Site icon NTV Telugu

WPL 2025: ఎలిమినేటర్‌లో గుజరాత్‌ చిత్తు.. ఫైనల్లో ముంబై ఇండియన్స్‌!

Wpl 2025 Eliminator

Wpl 2025 Eliminator

డబ్ల్యూపీఎల్‌ 2025 ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్‌ అదరగొట్టింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో గురువారం గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ ఛేదనలో గుజరాత్‌ 19.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ అయింది. డేనియలీ గిబ్సన్‌ (34; 24 బంతుల్లో 5×4, 1×6) టాప్‌ స్కోరర్‌. లిచ్‌ఫీల్డ్‌ (31; 20 బంతుల్లో 4×4, 1×6), భార్తీ ఫుల్మాలి (30; 20 బంతుల్లో 3×4, 1×6) మెరుపులు సరిపోలేదు. ముంబై బౌలర్లు హేలీ మాథ్యూస్‌ (3/31), అమేలియా కెర్‌ (2/28) రాణించారు. ఇక శనివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబై ఢీకొంటుంది.

ఎలిమినేటర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌ 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. నాట్‌సీవర్‌ (77; 41 బంతుల్లో 10×4, 2×6), హేలీ మాథ్యూస్‌ (77; 50 బంతుల్లో 10×4, 3×6) హాఫ్ సెంచరీలు చేయగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (36; 12 బంతుల్లో 2×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. చివరి ఐదు ఓవర్లలో ముంబై ఏకంగా 73 పరుగులు పిండుకుంది. గుజరాత్‌ బౌలింగ్‌తో పాటు ఫీల్డింగులోనూ విఫలమైంది. నాలుగు క్యాచ్‌లు వదిలేసి ముంబై భారీ స్కోరుకు బాటలు వేశారు.

భారీ ఛేదనలో గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది. పవర్‌ప్లే ముగిసే సరికి 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూనీ (6), యోల్‌ (8), గార్డ్‌నర్‌ (8) విఫలమయ్యారు. ఈ సమయంలో దశలో గిబ్సన్, లిచ్‌ఫీల్డ్‌ ధాటిగా ఆడారు కానీ.. ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. వీళ్లిద్దరూ ఔట్‌ అయ్యాక గుజరాత్‌ 12 ఓవర్లలో 107/5తో ఓటమి అంచన నిలిచింది. భార్తీ ఫుల్మాలి మెరుపులు మెరిపించినా.. ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి. 47 పరుగుల తేడాతో గుజరాత్‌ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Exit mobile version