ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ (MI) జట్టులో అంతర్గత విబేధాలు ముదిరిపాకాన పడ్డాయి. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను జట్టు నుండి తప్పించడం ఇక కేవలం కాలం నిర్ణయించాల్సిన విషయమేనని తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ నుండి భారీ ట్రేడింగ్ ఒప్పందం ద్వారా ముంబై జట్టులోకి తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యాకు యాజమాన్యం కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని హార్దిక్‌కు నాయకత్వం ఇవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే, హార్దిక్ రీ-ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయిందని, అక్కడ తీవ్రమైన ‘చేదు అనుభవాలు’, విభేదాలు నెలకొన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. హార్దిక్ జట్టులోకి వచ్చినప్పటి నుండి డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించిన అంతర్గత విషయాలు, రహస్యాలు నిరంతరం బయటకు పొక్కడం (లీక్ అవ్వడం)పై ముంబై మేనేజ్‌మెంట్ తీవ్ర అసంతృప్తితో ఉంది. సాధారణంగా ప్రతి జట్టులోనూ చిన్న చిన్న భేదాభిప్రాయాలు సహజమే అయినప్పటికీ, ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రస్తుతం ఉన్న గ్రూపు రాజకీయాలు, అసంతృప్తి మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయని ఒక అధికారి పేర్కొన్నారు. ఎంతోమంది దిగ్గజాలు, కెప్టెన్సీ మార్పులను చూసిన ఈ ఫ్రాంచైజీలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మైదానంలో ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్, కొందరు ప్లేయర్లు సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద ఎమోజీల వ్యవహారం జట్టులోని చీలికను స్పష్టం చేస్తోంది. ఆటగాళ్లు కేవలం అటెండెన్స్ వేయడానికే వస్తున్నట్లు కనిపిస్తోందని, జట్టు ప్రయోజనాల కంటే సొంత ప్రాధాన్యతలే ఎక్కువయ్యాయని యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో, డ్రెస్సింగ్ రూమ్ విషయాలను బయటకు లీక్ చేసే వారిపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబించాలని ముంబై మేనేజ్‌మెంట్ గట్టి నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీని తక్కువ అంచనా వేసి, ఆటతో ఆడుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని ప్లేయర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది.
